అన్నదాత కోసం బీఆర్ఎస్ దళం మరోసారి గర్జించింది. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా దాటవేస్తున్న కాంగ్రెస్‌పై భగ్గుమన్నది. ఇప్పుడు బోనస్ సన్నవడ్లకేనంటూ మాటమార్చడంపై ధ్వజమెత్తింది. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి నిరసనలకు దిగింది. నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా దీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు చేసింది. సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టింది. ‘కాంగ్రెస్ వచ్చింది. రైతులను నిండాముంచింది’ అంటూ మండిపడింది. బోనస్ విషయంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే మాటమార్చి, సన్నవడ్లకే ఇస్తామని ప్రకటించడంపై ఆగ్రహించింది. సన్నవడ్లకే కాదు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా కింద ఎకరాకు 15వేలు, కౌలు రైతులకు 12వేల సాయం చేయాలని డిమాండ్ చేసింది. ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొని, అన్నదాతకు భరోసానిచ్చారు. రైతులను సర్కారు ఆదుకోవాలని కోరుతూ స్థానిక ఆర్డీవో, తహసీల్ ఆఫీసుల్లో వినతి పత్రాలు అందజేశారు.
– కరీంనగర్, మే 16 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చుతున్నారని, కేవలం సన్న వడ్లు పండించిన వారికే బోనస్ ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కువ శాతం మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, సన్నవడ్లు పండించే రైతులు చాలా తక్కువ మంది ఉంటారని అన్నారు.
ఈ విషయంలో రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఓపీఎమ్ఎస్లో కేవలం ఏ గ్రేడ్, సాధారణ రకం వడ్ల వివరాల కాలమ్స్ మాత్రమే ఉంటాయని, సన్నవడ్లను ఏ విధంగా గుర్తిస్తారని ప్రశ్నించారు. బోనస్ ఇవ్వడాన్ని తప్పించుకునేందుకే మరో అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. ఇటు చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రైతులను వంచించిన ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని స్పష్టం చేశారు. మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తదితరులు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హుజూరాబాద్‌లో జరిగిన ధర్నాలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్ నేతృత్వంలో నిరసన దీక్ష చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైతులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ర్యాలీగా జగిత్యాల ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ధర్మపురిలోని అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు, రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం ర్యాలీగా తహసీల్ ఆఫీస్‌కు వెళ్లి ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో రైతులతో కలిసి నాయకులు నిరసన తెలిపారు. తర్వాత స్థానిక ఆర్డీవో కార్యాలయాల వద్దకు ర్యాలీగా వెళ్లి, వినతిపత్రాలు అందజేశారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో భారీ ధర్నా చేశారు. సిరిసిల్ల, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల నుంచి కార్యకర్తలు తరలివచ్చి, నిరసన తెలిపారు. అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్‌టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడలోని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహరావు కార్యాలయంలో చేపట్టిన ధర్నాకు రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ రూరల్ మండలాల నుంచి కార్యకర్తలు తరలి వచ్చారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎంపీపీ చంద్రయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ సర్కారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసేదాకా వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, ఎన్నికల తెల్లారే మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు వడ్లకూ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ‘రైతు నేస్తం బీఆర్ఎస్.. రైతు వ్యతిరేకి కాంగ్రెస్’ అని, ‘కరెంటు లేదు. నీళ్లు లేవు. బోనస్ లేదు’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. గోదావరిఖనిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని-రామగుండం ప్రధాన రహదారి మున్సిపల్ కార్పొరేషన్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. మంథనిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.