సిరిసిల్ల రూరల్, మే,11: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో బిజీబిజీగా గడిపారు. నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదిస్తూనే.. పలువురు బాధితులకు అభయమిస్తూ ముందుకుసాగారు. రాళ్లపేట మాజీ సర్పంచ్ తీగల దుర్గయ్య కొడుకు వివాహం ఇటీవలే జరుగగా, వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. మామిడి చెట్టు కొమ్మ తలపై పడి కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న తంగళ్లపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జంగపల్లి భిక్షపతితో ఫోన్లో మాట్లాడి అధైర్యపడకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న మండెపల్లికి చెందిన మహేశ్ కుటుంబసభ్యులను కలిశారు. మహేశ్‌తో వీడియో కాల్లో మాట్లాడారు. ‘నాలుగు రోజులు ధైర్యంగా ఉండు. అన్నీ చూసుకుంటా. నిన్ను మండెపల్లికి తీసుకువస్తా’నని ధైర్యం చెప్పారు. వీర్నపల్లిలో తెలంగాణ ఉద్యమకారిణి అల్వాల అంజమ్మను ఆప్యాయంగా పలుకరించారు. ‘అంజక.. బాగున్నవా.. ఆరోగ్యం ఎట్లుంది’ అని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇలా పలువురికి భరోసానిస్తూ, సమస్యలను వింటూ ముందుకుసాగారు.
ఎల్లారెడ్డిపేట, మే 11: ‘సార్ మీ వల్లే మా బాబు మాకు దక్కిండు. గుండె సంబంధిత చికిత్సకు మీరందించిన సాయం మరువలేను’ అంటూ ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన ముక్క బాల్‌రాజు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. బాల్‌రాజు-కల్పన దంపతులకు కొడుకు ఐదు నెలల క్రితం బాబు (భరత్‌కుమార్)జన్మించాడు. పుట్టుకపోతోనే గుండెకు రంధ్రం ఉందని, మందులతో తగ్గుతుందని వైద్యులు తెలిపారు. కానీ మూడు నెలలైనా తగ్గకపోగా, సమస్య పెద్దదై, శ్వాస ఇబ్బంది ఏర్పడింది. గత మార్చి 7న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఆపరేషన్ కోసం 8 లక్షలు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
దీంతో బాలుడి తల్లికి బంధువైన అల్మాస్‌పూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులకు తమ పరిస్థితిని తెలియజేయగా, వెంటనే వారు ఎమ్మెల్యే కేటీఆర్‌కు సమాచారం ఇచ్చారు. కేటీఆర్ స్పందించి బాలుడి ఆపరేషన్‌కు సాయం అందించే ఏర్పాటు చేశాడు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తికావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే అక్కపల్లికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ ఆదివారం అల్మాస్‌పూర్‌లోని రేణుకాదేవీ ఆలయానికి వస్తున్నట్లు సమాచారం తెలియడంతో బాల్‌రాజు వచ్చి కేటీఆర్‌ను కలిశాడు. ‘మీ వల్లే మా బాబు దక్కిండు సార్. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేమంటూ’ కృతజ్ఞతలు తెలిపాడు.