సిరిసిల్ల టౌన్/ ఎల్లారెడ్డిపేట, మే 15 : మనిషిని మనిషిలా చూసింది, గరీబోళ్లను ఆదుకున్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆయన విస్తృతంగా పర్యటించారు. మొదట తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో బీరప్ప కల్యాణ వేడుకలకు హాజరయ్యారు. వర్షాలు కురవాలని, కాలం మంచిగై బీరప్ప దయతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జీవసంపద దినదినాభివృద్ధి చెందాలని, శాంతిభద్రతలు బాగుండాలని కోరుకున్నారు.
అక్కడి నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. రాత్రి 7 గంటలకు పెద్దూరులో నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలోని దుర్వేషావలి దర్గా ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు.
పదేండ్ల కాలంలో కేసీఆర్ ఏనాడూ మతం పేరుమీద రాజకీయాలు చేయలేదని, హిందువులున్నా, ముస్లింలున్నా.. అందరినీ ఒకేలాగా చూసుకున్నారని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగొస్తే హిందూ మహిళలకు, రంజాన్ పండుగొస్తే ముస్లిం ఆడబిడ్డలకు, క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు చీరెలు పెట్టారని తెలిపారు. రాజకీయాలు మాట్లాడేందుకు తాను రాలేదని, దుర్వేషావలి బాబా ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
మతం, కులం పేరు మీద పంచాయితీ లేకుండా అందరం కలిసిమెలిసి అన్నాదమ్ములలెక్క ఉండాలని, దేశం మంచి కోసం కష్టపడి కొట్లాడుదామని ఆ బాబాను వేడుకుంటున్నట్లు చెప్పారు. అంతకు ముందు ముగ్దుం మొయినొద్దీన్ చెప్పిన ఉర్దూ షాయరీని ఉ ఠంకిస్తూ అందరం కలిసి కట్టుగా నడవాలని, పిల్లల మంచి భవిష్యత్తును కాపాడుకునేలా అప్రమత్తంగా ఉం డాలని, పెద్దలు చూపిన గంగా, జమునా, తహజీబ్ తీరున కలిసి బతికే పరంపరను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
హిందూ, ముస్లిం, సిక్కు అందరం కలిసి నడవాలని సూచించారు. అలాగే, దర్గాపై కప్పేందుకు ఉర్సూ నిర్వాహకులు షేక్ అజీజ్‌కు చాదర్, పూలను అందించారు. ఇక్కడ నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, నాయకులు షేక్ గౌస్, షేక్ ఉస్మాన్, సింగారం దేవరాజు, గనగోని మల్లేశం, మంగోలి నర్సాగౌడ్, ఎండీ చాంద్, జబ్బార్, ఇర్ఫాన్ ఉన్నారు.