సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్/ కోనరావుపేట/ గంభీరావుపేట, ఏప్రిల్ 9 : ఎప్పుడూ ప్రజా ఉద్యమాలతో బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం ఆధ్యాత్మిక సేవలో తరించారు. సిరిసిల్లలో రోజంతా బిజీబిజీగా గడిపారు. మొదట జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన హనుమాన్ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, పూజలు చేశారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా హనుమాన్ దీక్షా పరులతో కలిసి సహపంక్తి భోజనం(భిక్ష) చేశారు. సుమారు రెండు గంటల పాటు భజన, పూ జాది కార్యక్రమాల్లో పాల్గొనడంతో స్వాములు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి వెయ్యి మందికి పైగా స్వాములు తరలిరాగా, కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం ఆయనకు శ్రీరాముడి చిత్రపటం బహూకరించారు. ఆ తర్వాత కోనరావుపేట మల్కపేటలో మాజీ న్యాయ శాఖ మంత్రి చల్మెడ ఆనందరావు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి పూజలు చేయగా, అర్చకులు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కండువా కప్పి సత్కరించారు. అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి గంభీరావుపేటకు వెళ్లారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ-పెద్దిరాజుల కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి కట్న కానుకలు సమర్పించారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అమ్మవారు అందరినీ చల్లంగా చూడాలని కోరుకున్నారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కేటీఆర్‌ను సన్మానించారు. సిరిసిల్లలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, బొల్లి రామ్మోహన్, ఒజ్జల అగ్గిరాములు, కుంబాల మల్లారెడ్డి, పడిగెల రాజు, కొమిరిశెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.