జగిత్యాల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గురువారం జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డితో సమావేశం ముగిసిన తదుపరి కేటీఆర్, ఇటీవలే మృతిచెందిన ప్రముఖ చరిత్రకారుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గురువు అయిన జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణయ్య సార్ చిత్ర పటానికి నివాళులర్పించి, ఆయన రచించిన పుస్తకాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, చరిత్రకారుడిగా, ఉపన్యాసకుడిగా రమణయ్య విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రమణయ్య సార్‌పై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయన్నారు. గతేడాది జగిత్యాల పర్యటనకు కేసీఆర్ వచ్చిన సమయంలో తన గురువైన రమణయ్య సార్‌ను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చరిత్రను పరిశోధించి, కరీంనగర్ చరిత్ర-సంస్కృతి, నాగరికత, ప్రజల మత, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై గ్రంథాన్ని వెలువరించడం గొప్ప విషయమన్నారు. వేములవాడ శతకం, ఎలుగందుల చరిత్ర, సౌత్ ఇండియా టెంపుల్స్, కాకతీయ, చాళుక్య టెంపుల్స్‌పై పుస్తకాలు, పరిశోధనలు చేసిన గొప్పవ్యక్తి, మేదావి రమణయ్య సార్ అని శ్లాఘించారు.
కాగా ఈ సందర్భంగా రమణయ్య కుటుంబ సభ్యులు సైతం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గురువును గుర్తుంచుకొని సంతాపం తెలియజేయడంతో పాటు, స్వయంగా కొడుకును పరామర్శకు పంపించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రమణయ్య సార్ బతికున్న సమయంలోను, అవసాన సమయంలోను టీవీల్లో కేసీఆర్ ప్రసంగించిన సమయంలో తన శిష్యుడు అంటూ భావోద్వేగానికి గురయ్యేవాడని రమణయ్య కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు వివరించారు. కేటీఆర్ వెంట రమణయ్య సార్ శిష్యుడు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులున్నారు.