రాజన్న సిరిసిల్ల, మే 14 (నమస్తే తెలంగాణ) / సిరిసిల్ల టౌన్/ గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట : ‘కుట్రలు, కుతంత్రాలను లెక్కచెయ్యకుండా మొక్కవోని ధైర్యంతో గులాబీ దళం ముందుకెళ్లింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాట పటిమను చాటింది. ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక సీట్లు గెలుస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శక్తివంచన లేకుండా కష్డపడి పనిచేశామని, రేపు జరగబోయే జిల్లా పరిషత్, మండ పరిషత్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు పునాదిరాయి అవుతుందని కార్యకర్తలకు భరోసా కల్పించారు.
పదేండ్ల బీజేపీ ప్రభుత్వం, ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత చూస్తే రెండు కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించ బోతున్నాయని, ప్రముఖ పార్టీలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బిజూ జనతాదళ్‌లాంటి పార్టీలు, ప్రాంతీయ శక్తులే రేపు నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయన్నాని జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలువబోదంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని, కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ దిగరాక తప్పలేదని, ఆ పార్టీ నాయకత్వాలు తెలంగాణలో గింగిరాలు కొట్టాయని విమర్శించారు. బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ గులాబీ సైనికులకు ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్‌పై సరళిపై కార్యకర్తలతో చర్చించారు. అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఓటు వేయాలంటూ గడపగడపకూ వెళ్లి చెప్పడంతోపాటు విస్తృతంగా ప్రచారం చేసి రేయింబవళ్లు కష్ట పడ్డ కార్యకర్తలందరినీ అభినందించారు.
తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడి కాంగ్రెస్, బీజేపీ రాజకీయ వ్యవహారాన్ని ఎండ గట్టారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలోని సయ్యద్ అజ్రత్ ఇమా మ్ ఆలీ దుర్వేషావళీ దర్గాను సందర్శించారు. చాదర్కప్పి ప్రార్థనలు చేశారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో చౌడాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం గంభీరావుపేట మండలం గోరంటాలలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి ఎల్లమ్మ సిద్ధోగానికి హాజరై అక్కడి ప్రజల నుద్దేశించి ప్రసంగించారు.
ఎల్లమ్మ ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని, రైతు రుణమాఫీ, రైతుబంధు, మహిళలకు 2500, వృద్ధులకు 4 వేల హామీలు నెరవేర్చలేదని మండి పడ్డారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రాష్ట్ర రాజకీయాలను ఓ మలుపు తిప్పిందన్నారు. క్యాడర్ నుంచి లీడర్ల వరకు కేసీఆర్ బస్సుయాత్ర ప్రతి ఒక్కరిలో విశ్వాసం నింపిందన్నారు.
కేసీఆర్ పోరుబాటకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత, పార్టీ పది కాలాలపాటు చల్లగా ఉంటుందన్న భరోసాతో కార్యకర్తల్లో జోష్ పెంచిందన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తే ప్రభుత్వానికి ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, టీఎస్‌టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ముస్తాబాద్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపె ల్లి సురేందర్‌రావు, సీనియర్ నాయకులు చీటి నర్సింగారావు, బొల్లి రామ్మోహన్, ఎండీ సత్తార్, మండల శాఖ అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, కోడి అంతయ్య,రాములు పాల్గొన్నారు.