‘ఏ ఎన్నికైనా బీఆర్ఎస్కు తిరుగులేదు. ఎన్నికలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా ఏంటో చూపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటూ కడుపులో పెట్టుకుని చూసుకుంటానని భరోసా ఇచ్చారు. మనల్ని బాధిస్తున్న వారి పేర్లన్నీ రాసిపెట్టుకుంటున్నానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, అన్ని స్థానాల్లో మనమే గెలువాలని, రాష్ట్రంలోని 269 జడ్పీటీసీ స్థానాల్లో మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల, జూలై 17 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, అందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నాకోసం పని చేసిన్రు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మీ గెలుపు కోసం నేను పనిచేస్త’ అని అభయమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి ఎవరైనా సరే భయపడాల్సిందేనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన గురువారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అందరూ సమష్టిగా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్యాలెట్ బాక్స్ తెరిస్తే కాంగ్రెసోళ్ల గుండెలు అదరాలని, విజమయే లక్ష్యంగా కలిసి కట్టుగా పనిచేసి స్థానాలను సొంతం చేసుకోవాలని సూచించారు.
తాను సిరిసిల్ల అంటే గర్వ పడుతానని చెప్పారు. ఒక రూపాయి పంచకుండా, చుక్క మందు పోయకుండా గెలువడం తనకు గర్వంగా ఉందన్నారు. ఇది తాను, పార్టీ శ్రేణులంతా గర్వపడే విషయమన్నారు. పరిపాలన పరంగా సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి చారిత్రాత్మకమన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త, మాజీ ఎంపీటీసీ కుంటయ్య మరణం తనను తీవ్రంగా బాధించిందని, ఆయన కుటుంబ బాధ్యత తాను తీసుకున్నానని చెప్పారు.
కుంటయ్య కూతురు చదువు, వివాహం బాధ్యతలు తానే చూస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లి పోయిన నాయకులు, ఎమ్మెల్యేలు మళ్లీ వస్తామంటూ రాయభారం చేస్తున్నారని, వాళ్లను తీసుకోవద్దని కేసీఆర్ ఖరాఖండిగా ఆదేశించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ నడుస్తుందని, వారిలో సఖ్యత లేదన్నారు. అధికార పార్టీకి దీటుగా మనం పని చేయాలని పిలుపునిచ్చారు.
మన గెలుపే వాళ్ల బలుపునకు సమాధానం కావాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో తెలంగాణలోని ఏవర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వ్యాపారాలు, పరిశ్రమలు నడవడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు గెలుస్తామని కాంగ్రెసోళ్లు అనుకోలేదని, అనుకోకుండా వచ్చిన అధికారంతో ఆగమైతూ మనల్ని ఆగం చేస్తున్నారని తెలిపారు.
మానేరు వాగు మళ్లీ ఎడారైంది
స్వరాష్ట్రంలో వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్, నారుమళ్లు వేసిన సమయానికి ఎరువులు అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దుకాణాల ఎదుట లైన్లు కట్టలేక చెప్పులు పెట్టి ఎదిరి చూసే దుస్థితి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిరిసిల్ల మానేరు వాగులో నిండా నీళ్లుండేవని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన తర్వాత చుక్కనీరు లేక ఏడారిలా మారిందని, కరువు, దుర్భిక్షం నెలకొందని వాపోయారు.
రైతులు దుక్కులు దున్ని, దిక్కులు చూస్తున్న పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు, 3 బ్యారేజ్‌లు, 21 పంప్‌హౌస్‌లు ఉన్నాయని వివరించారు. కొండ పోచమ్మసాగర్ వద్ద 618 మీటర్ల ఎత్తుకు నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. ఒకో 139 మెగావాట్ల బాహుబలి మోటర్లతో ఎత్తిపోతల ద్వారా వ్యవసాయానికి నీరందించామని చెప్పారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమాతో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయని, తెలంగాణ రాకముందు ఎకరం 3 లక్షలున్న ధర కేసీఆర్ నిర్ణయాలతో 30 లక్షలకు పెరిగిందన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒకటికి రెండింతలు ఇస్తామని అడ్డగోలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ నేతలు తంటాలు పడుతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి ఏకంగా 48 గంటల కరెంటు ఇస్తానంటూ మెదక్‌లో ఓ నాయకుడు హా మీ ఇచ్చాడని, అసలు కరెంటే సరిగా రావడం లేదని రైతులు ధర్నాలు చేసే పరిస్థితి ఈ చేతగాని ప్రభుత్వంలో వచ్చిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకంతో ఆడబిడ్డల వివాహానికి అండగా నిలిస్తే, తులం బంగారం ఇస్తామంటూ కాంగ్రెస్ మాటతప్పిందని మండిపడ్డారు.
సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల పక్షాన పోరాడుదాం
గ్రామాల్లో అనేక సమస్యలున్నాయి. యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు అనేక అవార్డులు వస్తే, నేడు ఒక అవార్డు దిక్కులేదు. ఈ ప్రభుత్వం ఇంత మంచి పాలన అందిస్తున్నది. జీవితం చాలా చిన్నది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన మనం పోరాడుదాం. బండి సంజయ్ బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసేయాలంటున్నడు. ఆయన మత విద్వేషాలు లేపడం తప్ప చేసిందేంటి? రాష్ట్రంలో మనమే ప్రధాన ప్రతిపక్షం. బీసీ డిక్లరేషన్‌పై బీసీ సోదరులకు అవగాహన కల్పిద్దాం. – కేటీఆర్