Dasari Manohar Reddy | పెద్దపల్లి కమాన్, జనవరి 20: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని, గ్రామాలు, పట్టణాలు అన్ని రంగాలల్లో అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
పెద్దపల్లిలో సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు భజరంగ్ ఆధ్వర్యంలో 60 మంది కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ లో చేరగా, వారికి దాసరి మనోహర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రం కుంటుపడిందని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పరాభావం తప్పదని జోష్యం చెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేళ్లలో చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుందని అన్నారు.