మంథని, మే 3: రానున్న రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెం దిన ఆడుప కిషన్, సుధాటి వెంకటేశ్ శనివారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రాజగృహలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పుట్ట మధూకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా మాయమాటలతో కాలం వెల్లదీస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజాధరణ కోల్పోయిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లేక ప్రజలంతా ఆగమాగం అవుతున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.