అందరి చూపూ జగిత్యాల సభపైనే నెలకొన్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న నిర్వహించే భారీ మీటింగ్‌పైనే ఆసక్తి కనిపిస్తున్నది. పోరాటాల గడ్డమీది నుంచి గులాబీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సమరశంఖం పూరించి ప్రసంగించనుండగా.. ఆయన ఏం మాట్లాడుతారు? ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారును ఎలా ఎండగడుతారనే చర్చ జరుగుతున్నది. మరోవైపు కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో చేరనుండగా, ఉత్సుకత చూపుతున్నది. మొత్తానికి సభను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు కలియదిరుగుతుండగా, తరలివచ్చేందుకు పల్లె ప్రజానీకం సన్నద్ధమవుతున్నది.
జగిత్యాల, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండున్నరేళ్లలో ఏ ఒక్క వాగ్దానాన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. పైగా అన్ని వర్గాలనూ మభ్యపెడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నాయకులకు చేదు అనుభవం కూడా ఎదురవుతున్నది. మరోవైపు పార్టీలోనూ సీనియర్లను కాదని ఫిరాయింపు దారులకు ప్రాధాన్యం ఇస్తుండడంపైనా అసహనం కనిపిస్తున్నది.
ఈ పరిస్థితుల్లోనే మాజీమంత్రి, సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీ ఫిరాయింపుదారులకు అందలం ఎక్కిస్తూ కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన నాయకులు, కార్యకర్తలను చిన్నచూపు చూడడాన్ని నిరసిస్తూ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి జీవన్ రెడ్డి సమ్మతిని తెలియజేశారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరేందుకు సిద్ధమయ్యారు. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమరశంఖం పూరిస్తూ, జీవన్‌రెడ్డిని తమతో కలుపుకొని కాంగ్రెస్‌పై యుద్ధం చేసేందుకు ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని వారం క్రితమే నిర్ణయించగా, అప్పటి నుంచే అందరి చూపూ సభపైనే నెలకొన్నది.
కేసీఆర్ ప్రసంగంపైనే ఆసక్తి
జగిత్యాల జిల్లాలోని 20 మండలాల పరిధిలోని గులాబీ శ్రేణులు పల్లెలు, పట్నాల్లోని గడప గడపకూ కలియదిరుగుతూ, సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, విజయవంతం చేయాలని కోరుతున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, మళ్లీ పోరాటం చేస్తేనే తెచ్చుకున్న తెలంగాణలో తిరిగి బాగుపడుతామని, అందుకు కేసీఆర్ జగిత్యాల సభతోనే నాంది పడుతుందని పేర్కొంటున్నారు. కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళ సంఘాలు, రైతుసంఘాలతో గులాబీ శ్రేణులు సమావేశాలు నిర్వహించి సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇక జగిత్యాల జైత్రయాత్ర బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ హాజరవుతుండడంతో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు.
దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ సభలో పాల్గొనేందుకు వస్తుండడం, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేని నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుంది? సమస్యలను ఆయన ఏవిధంగా అడ్రస్ చేయనున్నారు? అనే విషయాలపై చర్చిస్తున్నారు. పదునైన ప్రసంగం, ఘాటైన పదజాలం, అచ్చతెలంగాణ జాన తనం కలగలిపి సాగే కేసీఆర్ ప్రసంగాన్ని మరోసారి వినేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. రైతు భరోసా మూడు సార్లు అందకపోవడం, రైతు బీమా సైతం సందిగ్ధంలో పడడం, రైతుకూలీలకు ప్రభుత్వ సాయం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం, నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఉద్యోగాల ప్రకటన లేకపోవడం, జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు.
ఇక రేషన్‌కార్డుల తొలగింపు, కరెంట్ కోతలు తదితర అంశాలపై సైతం ప్రజలు కోపాన్ని ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పెన్షనర్లకు ఇప్పటి వరకు వారి జీపీఎఫ్ ఇతర బెనిఫిట్స్ లేకపోవడం, అనారోగ్యానికి వైద్యం చేయించుకునే స్థితి సైతం లేకపోవడంతో వారు సైతం ప్రభుత్వంపై పట్టరాని కోపంతో ఉన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు జగిత్యాల సభకు తరలివచ్చేందుకు రెడీ అవుతున్నారు. కుల సంఘాలు, విద్యార్థులు, పీఆర్సీ నుంచి మొదలు కొని ఎలాంటి ప్రయోజనాల అమలుకు నోచుకోని ప్రభుత్వ ఉద్యోగులు సభపై ఆసక్తి చూపుతున్నారు. రేవంత్‌రెడ్డిని నమ్మిమోసపోయామని వారంతా వాపోతున్నారు. కేసీఆర్ జగిత్యాల సభలో తమ సమస్యలను అడ్రస్ చేస్తే వాటికి పరిష్కారం లభించే అవకాశం ఉందని, ఒకవేళ పరిష్కారం లభించకపోయినా, భవిష్యత్‌లో కేసీఆర్ సర్కార్ వచ్చాకైనా తమకు ప్రయోజనం కలుగుతుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
జీవన్‌రెడ్డి చేరికపైనా
సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరుతుండడంపై ప్రజల్లోనూ, విశ్లేషకుల్లోను ఉత్సుకత నెలకొంది. రైతు నాయకుడిగా, నిజాయితీ పరుడైన రాజకీయవేత్తగా జీవన్‌రెడ్డి పేరు సంపాదించారు. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు, ఉత్తర తెలంగాణలో కీలక నాయకుడిగా ఉన్నారు. ప్రజాసంబంధాలు కలిగిన అనుభవజ్ఞుడైన నాయకుడు బీఆర్ఎస్లో చేరుతుండడం, అటు బీఆర్ఎస్కు, ఇటు జీవన్‌రెడ్డికి ఇద్దరికి కలిసి వస్తుందన్న చర్చ నడుస్తున్నది.
జీవన్‌రెడ్డికి సైతం జగిత్యాల జిల్లాతో పాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఉండడంతో వారు సైతం తమ పరిధిలో సమావేశాలు నిర్వహించుకొని సభను విజయవంతం చేసే దిశగా పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా జగిత్యాల సభ ముచ్చటనే వినిపిస్తుండడం విశేషం. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు, మరో వైపు జీవన్‌రెడ్డి అనుచరులు, రైతులు, కార్మికులు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు సభపై ఆసక్తిచూపుతున్న నేపథ్యంలో ‘జైత్రయాత్ర’ జన ప్రభంజనాన్ని సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గులాబీమయం
జగిత్యాల జిల్లా కేంద్రం గులాబీమయమైంది. మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరుతున్న నేపథ్యంలో జిల్లాకేంద్రంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఎటు చూసినా గులాబీ శ్రేణులతో సందడి కనిపిస్తున్నది. జిల్లా కేంద్రంలోని ప్రతీ రోడ్డులో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా కేసీఆర్, కేటీఆర్, జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, విద్యాసాగర్‌రావు, దావ వసంత, కార్యకర్తలు, నాయకుల ఫొటోలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు కనివిందు చేస్తున్నాయి. ఏ వీధులను పరిశీలించినా గులాబీమయమయ్యాయి.

Ktr
సభకు సమాయత్తం
జగిత్యాల సభకు సర్వం సన్నద్ధం చేస్తున్నారు. శనివారం బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావుతో కలిసి ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లలో లీనమయ్యారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనర్సింహారావు నియోజకవర్గాల్లో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
ఇటు నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా వచ్చిన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేములప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, తదితరులు ఇక్కడే మకాం వేసి మార్గదర్శనం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఇక సభ జరిగే మినీస్టేడియంలో భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు. అలాగే, సభకు హాజరయ్యే ప్రజల కోసం కుర్చీలు సమకూర్చారు.