కాళేశ్వరం జలాల కోసం బీఆర్ఎస్ బృందం పోరుబాట పట్టింది. నీటిని ఎత్తిపోయకుండా.. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలపై గర్జించింది. సోమవారం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి, వారంలోగా పంపులను నడపాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే రైతులతో వచ్చి మోటర్లు తామే ఆన్ చేస్తామని స్పష్టం చేసింది.
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/ మహదేవపూర్ : ‘రైతులు కరువుతో విలపిస్తుంటే వారి కన్నీళ్లు చూస్తూ ఊరుకోం. కాళేశ్వరం జలాలను ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వదలం. లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌లో మోటర్లను మీరు రన్ చేస్తరా.. మమ్మల్ని చేయమంటరా..?’ అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కాంగ్రెస్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. సోమవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీ నర్సింహారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు దావ వసంత, జక్కు శ్రీహర్షిణి, కార్యకర్తలు సహా సుమారు 500మంది కన్నెపల్లి పంప్‌హౌస్‌కు తరలివెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంప్‌హౌస్‌లో వెంటనే మోటర్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరదను పరిశీలించారు.
పంప్‌హౌస్ వద్ద ఉద్రిక్తత
పంప్‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ నాయకులను పంప్‌హౌస్‌లోకి పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు పంప్‌హౌస్ గేటు వద్దకు వచ్చి, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో భారీ బందోబస్తుతో శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొప్పుల ఈశ్వర్, వినోద్‌కుమార్, పుట్ట మధు.. డీఎస్పీతో వాగ్వాదానికి దిగి గేటు వద్ద బైఠాయించారు. అనంతరం ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్‌తో ఫోన్లో మాట్లాడారు. పంప్‌హౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉన్నా నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారంలోగా పంపింగ్ చేయకపోతే రైతులతో కలిసి వస్తామని, మోటర్లు ఆన్ చేస్తామని స్పష్టంచేశారు.
కావాలనే కుట్రలు
కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్ట్ కాళేశ్వరం. గతంలో ఈ ప్రాజెక్ట్‌తో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం సస్యశ్యామలం అయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో సాగునీరే కాక మత్స్య సంపద పెరిగి వేలాది మందికి జీవనోపాధి లభించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాళేశ్వరంను నిర్లక్ష్యం చేస్తున్నది. కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెక్యుల నీరు వృథాగా పోతున్నది. అన్నారం బరాజ్ వద్ద గేట్లు ఎత్తడంతో ఎల్ఎండీ ఇతర వాగుల నుంచి వచ్చిన నీరు వృథాగా పోతున్నది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లను ఆపే పరిస్థితులున్నా ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తున్నది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలకు సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంగ ఒడ్డున ఉండి చేప దూపకు ఏడ్చినట్టు తయారైంది మంథని నియోజకవర్గ ప్రాంత రైతుల పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి మోటర్లను ఆన్‌చేసి సాగునీరు ఇవ్వాలి. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం.
– పుట్ట మధూకర్, మంథని మాజీ ఎమ్మెల్యే
నీళ్లు ఎత్తిపోయాల్సిందే
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని లిప్టు చేసి రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశం ఉన్నది. కానీ, రేవంత్ ప్రభుత్వం కావాలని కుట్రలు చేస్తున్నది. వారం రోజులు గడువు ఇస్తున్నాం.. ఈ లోగా మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించకపోతే కేటీఆర్, హారీశ్‌రావు ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులతో పంప్‌హౌస్‌ను ముట్టడించి మోటర్లను ఆన్ చేస్తాం. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకున్నా కన్నెపల్లి వద్ద ప్రస్తుతం ప్రాణహిత ప్రవాహం సుమారు లక్షా నలభైవేల క్యూసెక్కులు వస్తున్నది. ఈ నీటిని ఎత్తిపోయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి? రాష్ట్రంలో ఉన్న చెరువుల్లో నీళ్లు లేవు. సాగునీటి కోసం వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
కాళేశ్వరం నీళ్లతోనే కరువు దూరం
ఒక పిల్లర్ కుంగితే ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టునే పక్కన పెట్టింది. కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నది. మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగినా లక్ష్మీ పంప్‌హౌస్ ద్వారా నీటిని లిప్టు చేసి చెరువులు, రిజర్వాయర్లు నింపవచ్చు. ఈ విషయం కాంగ్రెస్ సర్కారుకు తెలిసినా కావాలనే కుట్రలు చేస్తున్నది. మేడిగడ్డ బరాజ్ నుంచి రోజూ 10 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతున్నది. కాళేశ్వరం పంపులను నడిపి నీళ్లిస్తే కరువును దూరం చేయవచ్చు. కానీ, ఉత్తమ్, రేవంత్‌కు ప్రాజెక్టులపై ఏ మాత్రం అవగాహన లేదు. కేసీఆర్‌ను బద్నాం చేయడమే వాళ్లకు తెలుసు.
– బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
సాగునీటికి కేసీఆర్ అధిక ప్రాధాన్యం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోనే రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు ఆనందంగా ఉన్నారు. కాళేశ్వరంపై ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా పటాపంచలు చేస్తూ రైతుల పక్షాన ముందుకు సాగుతాం. కాంగ్రెస్ అబద్ధాల పాలనను, కుట్రలను ఎండగడుతాం. ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించే బీసీ గర్జన సభలో రిజర్వేషన్‌పై కాంగ్రెస్ ఆడే డ్రామాను ప్రజలకు ముందుంచుతాం.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ