జగిత్యాల, మే 31(నమస్తే తెలంగాణ): ‘రేవంత్ రెడ్డికి రైతుల కష్టం ఏం తెలుసు? ఎద్దు తెలుసా.. ఎవుసం తెలుసా..? కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే తెలుసు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకే రైతు డిస్కం ప్రతిపాదనను తెచ్చాడని, ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని మండిపడ్డారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని, అలా పెడితే ఓటు అడగమని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. ఒకే ఒక్క అంశానికి సూటిగా సమాధానం చెప్పాలన్నారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకూ మీటర్లు పెట్టడం లేదని చెప్పాలని, అలా పెడితే ఓటు అడుగనని నేరుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఏర్పాటు చేసి రీడింగ్ తీయడం అన్యాయమన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టని వారు, రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించే వారే అయితే, ఎందుకు రైతు డిస్కమ్ ఏర్పాటును తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి రైతు సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టమని, రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేయమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఈఆర్సీ సమావేశంలో ‘బోరు బావికి మూడు గంటల కరెంటు చాలు’ అని మాట్లాడడం దేనికి సంకేతమన్నారు. అవి రేవంత్‌రెడ్డి మాటలని, కోదండరెడ్డి నోటి నుంచి వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పుట్టిందే విద్యుత్ అంశం నుంచి అని వివరించారు. రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ సీఎం అయ్యాక 24 గంటల నిరంతర విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి అందిస్తే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు కుట్ర పన్నారని, రైతు డిస్కమ్, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారని మండిపడ్డారు. పైగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే ఓటు అడు గ అంటూ రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం ఆశ్చర్యంగా ఉందన్నారు.
తప్పుడు హామీలు, కుట్రలతో ఆయన రైతులను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసా అని ప్రకటించి మూడు పంటలకు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టడాన్ని మార్చుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఎలాగైతే దోపిడీ మార్గాలను ఎంచుకుంటున్నారో..? జిల్లాల్లో ఆయన అనుచర వర్గం సైతం అదే బాటలో నడుస్తున్నదని ఆరోపించారు. మంత్రిగా లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇసుక బజార్ ప్రారంభించారని, అయితే ఇప్పటి వరకు ఇసుక రీచ్‌లో ఎన్ని ట్రాక్టర్ల ఇసుకను విక్రయించారో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. నిత్యం ఇసుక అక్రమ రవాణా అవుతుందని, దీనికి లెక్కేలేదన్నారు. ఇది ఎస్పీకి, కలెక్టర్‌కు కనపడడం లేదా అని ప్రశ్నించారు.
ధాన్యం సేకరణలో రూ.110 కోట్ల స్కాం : మాజీ మంత్రి కొప్పుల
ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులను అష్టకష్టాలు పాలు చేసిందని మండిపడ్డారు. అదనపు తూకంతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్ హయాంలో తరుగు పేరిట ఒక కిలో అదనంగా జోకితే కాంగ్రెస్ నాయకులు గగ్గోలుపెట్టి, రైతులను రెచ్చగొట్టారని.. మరి ఇప్పుడు ఎవరి ఆదేశాల మేరకు అదనంగా జోకుతున్నారని ప్రశ్నించారు. ఏడు కిలోల అదనపు తూకం అంటే రైతు ఒక్క క్వింటాల్‌కు రూ.23.89 నష్టపోతున్నాడని, ఈ లెక్కన ఒక్క జగిత్యాల జిల్లాలోనే రూ.83 కోట్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు.
ఇక హమాలీ ఛార్జీలు, ధాన్యాన్ని అంతటిని బీ గ్రేడ్‌గా ప్రకటించడం, లారీపై ధాన్యాన్ని తరలించేందుకు అదనపు చెల్లింపుల కింద క్వింటాల్‌కు రైతు రూ.45 చెల్లిస్తున్నారన్నారు. ఈ ఎక్ట్సా చార్జీల పేరిట జిల్లాలో రూ.22 కోట్లు రైతుల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. మొత్తంగా ధాన్యం కొనుగోళ్లలో రూ.110 కోట్ల కుంభకోణం జరుగుతుందన్నారు. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మక్క కొనుగోలుకు సంబంధించి జగిత్యాల జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్లో విక్రయానికి వస్తే, ప్రభుత్వం కేవలం 60 శాతం మక్కను మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి, మిగిలిన 40 శాతం దిగుబడులను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకోవాలని చెప్పడం అన్యాయమన్నారు. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.1700 చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని రైతులు నిండా మునుగుతున్నారన్నారు. మక్క సాగు చేసిన రైతు ఎకరాన దాదాపు రూ.25వేలు నష్టపోతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.