సారంగాపూర్, మే 15: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం బీర్పూర్తోపాటు తుంగూర్‌లో మక్కలు, వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎకరానికి 40క్వింటాళ్లు మక్కల దిగుబడి వస్తుంటే ప్రభుత్వం 25 క్వింటాళ్లే సేకరిస్తున్నదని, మిగిలిన 15 క్వింటాళ్లకు మద్దతు ధరను రైతులు నష్టపోతున్నారని చెప్పారు.
కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర రూ.2400 ఉంటే బయట మార్కెట్లో దళారులు రూ.1500కే కొంటున్నారని, ఫలితంగా క్వింటాల్‌కు రూ.600 చొప్పున మొత్తంగా రూ.9వేలు నష్టపోవాల్సి వస్తున్నదని చెప్పారు. మక్క పంటను ఆన్లైన్ చేసుకుంటేనే కొంటున్నారని, ఈ కొత్త విధానంపై రైతులకు ఎలా అవగాహన ఉంటుందని ప్రశ్నించారు. ఎవరు ఏం పంట వేస్తున్నారో..? వ్యవసాయ అధికారులే ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదన్నారు. బీర్పూర్లో నాలుగు రోజుల నుంచి గన్నీ బ్యాగ్స్ లేవని, అధికారులకు ఫోన్ చేస్తే ఇప్పుడు 5వేల బ్యాగులు, రేపు 10వేల బ్యాగులు పంపిస్తామని చెబుతున్నారని, ఇంకా 20వేల బ్యాగులు స మకూర్చితే కొనుగోళ్లు పూర్తవుతాయని చెప్పారు.
కొనుగోళ్లపై సీఎం రివ్యూ చేసి ప్రతి గింజను కొంటామని చె ప్పారని, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సైతం అదే కథ చెప్పారని, మరి ఎక్కడ సేకరిస్తున్నారో తెలియడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారని, రవాణా చేసేందుకు లారీలు కనబడాల్నా..? ట్రాక్టర్లు కనిపిస్తున్నాయన్నారు. కొరత ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాలం ముంచుకొస్తున్నదని, ఎప్పుడు ఏం అయితదో తెలియడంలేదని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. బీట్‌లో ఉన్న ధాన్యం తరలించేందుకు తనవంతు చర్యలు తీసుకుంటామన్నారు.