రైతన్న కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కారు ధోఖాపై భగ్గుమన్నది. ఈ నెల 15లోగా ఏకకాలంలో రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ఆశచూపి, తీరా అనేక కొర్రీలతో వేలాది మందికి మొండిచేయ్యి చూపడంపై ఆగ్రహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. వందలాదిగా తరలివచ్చిన రైతులతో కలిసి నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ధర్నాలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించింది. ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని, లేకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. రైతుల కోసం ఎంతకైనా తెగిస్తామని, సర్కారు దిగొచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించింది.
-కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన ధర్నా చేశారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునీల్ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ డీఆర్వో పవన్ కుమార్‌కు నాయకులు వినతి పత్రం అందించారు.
అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అలాగే మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ధర్నాలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం నుంచి నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకున్నారు.
దాదాపు అరగంట పాటు అక్కడ రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి డీసీఎం వ్యాన్లలో పోలీసుస్టేషన్‌కు తరలించారు. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర తీశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.