మరో చారిత్రక ఘట్టానికి వేదికైన ఎల్కతుర్తికి గులాబీ దండు కదిలింది. ముందుగా ఊరూరా గులాబీ జెండాను ఆవిష్కరించి, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉప్పెనలా కదిలింది. కరీంనగర్ జిల్లా నుంచి వేల మంది వెళ్లగా, ఏ దారి చూసినా గులాబీమయమై కనిపించింది. యువత, ప్రజలు స్వచ్ఛందంగా తరలగా, పొద్దు పొడుపు నుంచే బండెనక బండి కట్టి వందల వాహనాల్లో బయలుదేరి మధ్యాహ్నంకల్లా మీటింగ్ స్పాట్‌కు పోటెత్తింది. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించి అధినేతకు నీరాజనం పట్టింది.
కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్/ హుజూరాబాద్/ జమ్మికుంట/ వీణవంక/ సైదాపూర్/ మానకొండూర్/ శంకరపట్నం/ తిమ్మాపూర్/చిగురుమామిడి/ గన్నేరువరం /చొప్పదండి/గంగాధర/రామడుగు, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఊరూ, వాడా రజతోత్సవ సంబురాన్ని నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. అన్ని మండలాల్లో ఊరూరా గులాబీ జెండాను ఆవిష్కరించి, కేకులు కట్ చేసి, స్వీట్లు పంచారు.
‘జై కేసీఆర్..’ నినాదాలతో అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఎల్కతుర్తి సభకు బస్సులు, ఇతర వాహనాల్లో స్వచ్ఛందంగా భారీగా తరలివెళ్లారు. నగరంలోని అన్ని డివిజన్లు, ప్రధాన చౌరస్తాల్లోనూ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుడు గులాబీ జెండాను ఆవిష్కరించి సంబురాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు బస్సుల్లో తరలివెళ్లారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ బైపాస్ వద్ద లారీ అసోసియేషన్ చౌరస్తాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. రామడుగు మండలం నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా సభకు తరలివెళ్లాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ యువజన విభాగం చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి బందారపు అజయ్‌కుమార్ రక్తదానం చేసి, పార్టీపై అభిమానాన్ని చాటారు.
బీఆర్ఎస్కే ప్రజా అండ
కార్పొరేషన్, ఏప్రిల్ 27: ప్రజల మధ్యలో ఉండే పార్టీ బీఆర్ఎస్ అని, వారి అండ ఎప్పుడూ తమకు ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నగరంలో బొమ్మకల్ చౌరస్తాలోనూ పార్టీ జెండాను ఆవిష్కరించి సంబురాలు చేసుకున్నారు. ఎల్కతుర్తి సభ కోసం ఏర్పాటు చేసిన బస్సులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వారి వారి వాహనాల్లో తరలివస్తుండడం పార్టీపై వారికి ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం బస్సు టాప్‌పైకి ఎక్కి కార్యకర్తలు, నాయకులతో పాటు కలిసి ఎమ్మెల్యే గంగుల సభకు తరలివెళ్లారు. వీరితో పాటు 200కు పైగా మంది కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్లు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.