గంగాధర, ఏప్రిల్ 25: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా గంగాధర మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. నేతల సన్నాహక సమావేశాలు, వాల్ రైటింగ్స్, గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గద్దెల నిర్మాణం, వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ, జెండాలు, కండువాల పంపిణీ, వాహనాలకు అంటించే స్టిక్కర్ల పంపిణీ, రజతోత్సవ సభకు జనాన్ని తరలించడానికి గ్రామాల్లో కలిసికట్టుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో మండలంలో సందడి నెలకొంది.
రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి, గ్రామాల నుంచి లక్ష్యం మేరకు జనాన్ని తరలించడానికి నాయకుడి నుంచి కార్యకర్త వరకు కలిసి పని చేస్తున్నారు. ఇప్పటికే వాల్ రైటింగ్, వాల్ పోస్టర్లు అంటించే కార్యక్రమం పూర్తి కాగా, సభకు తరలివచ్చే జనం కోసం కండువాలు, వాహన స్టిక్కర్లను నాయకులు గ్రామాల్లో కార్యకర్తలకు అందజేస్తున్నారు. లక్ష్యం మేరకు జనాన్ని తరలించడానికి వాహనాలను సిద్ధం చేశారు. ఈనెల 27వ తేదీన గ్రామ గ్రామాన బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి, సభకు తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. 25 ఏళ్ల బిఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఆనాటి ఉద్యమ గుర్తులను, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం, స్వరాష్ట్రంలో పదేండ్ల అభివృద్ధిని గుర్తు చేసుకోవడానికి సభకు తరలి వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నట్టు కార్యకర్తలు తెలిపారు.