మెట్పల్లి టౌన్, జనవరి 25 : ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ఓటడిగే నైతిక హక్కు లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 12 వార్డుకు చెందిన సుద్దాల హారిక-రాజేశ్వర్ గౌడ్ దంపతులతో పాటు సుమారు 120 మంది వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే గులాబీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ వంటి ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రజల గుండె ల్లో ఉన్నారని, మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.