‘మాది పేదల ప్రభుత్వం. మనసున్న ప్రభుత్వం. సబ్బండవర్గాల సంతోషమే లక్ష్యం. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మనిషి పుట్టుక నుంచి చివరి దాకా.. ప్రతి దశలో ఏదో ఒక పథకాన్ని అందిస్తూ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని చెప్పారు. త్వరలోనే ఆసరా పింఛన్ సాయాన్ని పెంచుతామని, రూ.లక్ష సాయం నిరంతర ప్రక్రియ అని, దశలవారీగా బీసీ కులాలన్నింటికీ అందిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం వేములవాడ, సిరిసిల్లలో పర్యటించిన ఆయన, ఆయాచోట్ల మాట్లాడారు. వచ్చే నెలలో మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, అది అందుబాటులోకి వస్తే ఏ వ్యాధికైనా రూపాయి ఖర్చు లేకుండా చికిత్స అందుతుందని వివరించారు. వేములవాడ పట్టణాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
సిరిసిల్ల కలెక్టరేట్/సిరిసిల్ల రూరల్/వేములవాడ, ఆగస్టు 8: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనలో స్వరాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడలో విస్తృతంగా పర్యటించిన ఆయన, ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ సంక్షేమానికి స్వర్ణయుగంలా వెలుగొందిందని గర్వంగా చెప్పవచ్చన్నారు. మనిషి పుట్టుక నుంచి చివరి దశ దాకా ఏదో ఒక పథకం పేదలకు అందేలా రూపొందించి ప్రతి పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని చెప్పారు. పుట్టుకతోనే కేసీఆర్ కిట్ మొదలుకొని, వృద్ధాప్యంలో ఆసరా పింఛన్ దాకా అనేక పథకాలు అమ లు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ పాఠశాల నుంచి పెద్ద చదువుల దాకా ఏదో ఒక పథకం పేదలకు అందించి అండగా నిలిచిందన్నారు. ఇవన్నీ ఒకవైపు అయితే ఆర్థికంగా పేదరికంలో ఉన్న కొన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్ మంచి మనసుతో ఆలోచించి పథకాలు చేపట్టారన్నారు. వెనుకబడిన దళితులను ధనికులను చేసేందుకు అద్భుతమైన దళితబంధు ప్రవేశపెట్టారని, ఆ పథకంతో బ్రహ్మాండమైన ప్రగతి కనిపిస్తుండడం గర్వం గా ఉందన్నారు. అలాగే కులవృత్తులు, చేతి వృత్తుల వారికి కూడా ఆర్థికసాయం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచించారని, ఈ టర్మ్ నుంచే వారికి కూడా సాయం చేద్దామని భావించారన్నారు. దశాబ్దాలు, శతాబ్దాలుగా గూడుకట్టుకుపోయిన పేదరికాన్ని బద్దలు కొట్టేందుకు, చేతివృత్తులు, కులవృత్తుల్లో పేదరిక నిర్మూలన చేయడానికి అన్ని వర్గాలకు ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. ఇందులో భా గంగా తొలుత 14 ఎంబీసీ కులాలకు రూ.లక్ష ఆర్థి కసాయాన్ని పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 10 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో మొదటి విడుతగా 600 మందికి రూ.6 కోట్లు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రతి విడుత రూ.6 కోట్లు విడుదల చేసి అందజేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థికసాయం అందించే బాధ్యత మాది అని, మీరు సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టి చూసుకోవాలని సూచించారు.
ప్రతి సంక్షేమ పథకం పేదవారికి చేరేలా..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకే చేరుతున్నదన్నారు. రైతుబంధు, ఆరోగ్య శ్రీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. అన్నీ ఆటోమేటిక్‌గా లబ్ధిదారులకు పోతున్నాయని, తమను పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు తనతో చెప్పుకుంటున్నారని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. సీఎం కేసీఆర్ ఒకటే మాట చెప్పారని, మంచి చేసే ప్రభుత్వాన్ని, మంచి చేసే నాయకున్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని వివరించారు. వంద మంది ప్రజాప్రతినిధుల్లో ఒక్కరు లాలూచీ పడినా అందరికీ చెడ్డ పేరు వస్తుందని, అందుకే లబ్ధిదారులకు నేరుగా అందివ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇవ్వాల రాష్ట్రంలో 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. కేసీఆర్ కిట్టు కూడా నేరుగా అందజేస్తున్నారని వివరించారు. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అన్న మాట మారిందని, ఇప్పుడు ‘నేనువోత బిడ్డో.. సర్కారు దవాఖాన’కు అన్నట్లు పరిస్థితి ఉందన్నారు. ఇవ్వాళ సర్కారు దవాఖానల్లో 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు.
కులవృత్తులకు దశల వారీగా సాయం
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పద్మశాలీలకు రావడం లేదని తమకు విజ్ఞప్తులు వస్తున్నాయని, రాని బీసీ కులాలకు కూడా దశల వారీగా ఆర్థికసాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించా రు. చేనేత దినోత్సవం రోజున నేతన్నకు చేయూత, చేనేత హెల్త్ కార్డు, చేనేత మిత్రతో పాటు 9 కార్యక్రమాలు ప్రారంభించుకున్నామని చెప్పారు. ఆరేం డ్ల నుంచి బతుకమ్మ చీరలు, ఇతర పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నేతన్నకు బీమా కూడా ఈ మధ్య నుంచే అమలు చేస్తున్నామన్నారు. ఇతరులకు ఇచ్చినప్పుడు అసూయ పడవద్దని, అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుంటూ దశల వారీగా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని స్పష్టం చేశారు.
గృహలక్ష్మి ప్రారంభం
సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నదని, కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ని యోజకవర్గానికి 3వేల మంది చొప్పున అని సీఎం చెప్పారని, సిరిసిల్ల, వేములవాడలో మొత్తం ఆరువేల మందికి అందజేస్తామని వివరించారు. గతం లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కుటుంబంలో పెద్ద కొడుకు ఉండి, వేరు పడితే వారికి కూడా అందిస్తామన్నారు.
వేములవాడలో 24గంటల నీటి సరఫరా ఉండాలి
వేములవాడలాంటి 50వేల జనాభా ఉన్న పట్టణంలో కావాల్సిన వసతి సౌకర్యాలన్నింటినీ సమకూరుస్తామని మంత్రి పేర్కొన్నారు. తాగునీటి సౌకర్యం, గుడిచెరువులోకి నీటిని ఎత్తిపోసే పథకం, చెరువును కూడా అభివృద్ధి చేసి రహదారులను కూడా మెరుగుపరిచామన్నారు. రాజన్న ఆలయ అనుబంధ బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ కోసం రూ.18కోట్లు వెచ్చించి ఎకరం స్థలం సేకరించడమే కాకుండా రూ.12కోట్లతో విస్తరణ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో నిరుపేదలకు దాదాపు 800 మందికి ఇండ్ల పట్టాలు ఇస్తామని, ఎవరైనా మిగిలిన వారు ఉంటే దరఖా స్తు చేసుకోవాలన్నారు. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడుకోవాలని, మహాలక్ష్మీవీధిలో మిషన్‌భగీరథ పథకాన్ని ప్రారంభించిన అనంతరం కాలనీ మహిళలతో మంత్రి అన్నారు. అనంతరం మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ.. వేములవాడ పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారని, ఇక్కడ తిరుమల తిరుపతి తరహాలో 24గంటల పాటు మంచినీటి సరఫరా ఉండేలా ప్ర తిపాదనలు చేస్తే నిధులు అందిస్తానని చెప్పారు.
వస్త్ర పరిశ్రమను ‘నెక్స్ లెవెల్’కు తీసుకెళ్లాలి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ‘నెక్ట్స్ లెవెల్’కు తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారులు, వ్యాపారులకు సూచించారు. కలెక్టరేట్లోని స్టేట్ చాంబర్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, టెక్స్టైల్ అధికారులతో ప్రత్యే క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కార్మికుల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పోటీ పడేందుకు వీలుగా మనం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అన్ని రకాల వస్త్ర పరిశ్రమలను సిరిసిల్లలో స్థాపించేలా కృషి చేయడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రణాళికాబద్ధంగా వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధి
దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న ఆలయాన్ని ప్రణాళిక బద్ధంగా అంచలంచెలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు, ఆలయ పవిత్రతకు ఇబ్బంది కలుగకుండా ముందుగా పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి, తగిన పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు చేయాలని, వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి ఆలయంలో స్థలం ఎక్కువగా ఉందని, వేములవాడలో సేకరించిన స్థలంలోనే ఆలయాన్ని అత్యంత అందంగా తీర్చిదిద్దుతామన్నారు. గుడిచెరువు బండ్ సుందరీకరణను రూ.12కోట్లతో చేపడుతున్నామని, వచ్చే దసరా నాటికి పనులు పూర్తి కావాలని, అవసరమైతే మూడు విడుతలుగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. 1400 మీటర్ల మేర బండ్‌ను సుందరీకరించడమే కాకుండా ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ఏరియా దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్ కళాశాల ప్రారంభం
వచ్చే సెప్టెంబర్‌లో రాజన్నసిరిసిల్లలో పూర్తయిన మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇటీవల మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీని పరిశీలించానని, అక్కడ 140మంది ప్రభుత్వ వైద్యులు పని చేస్తున్నారని, త్వరలోనే సిరిసిల్ల మెడికల్ కాలేజీలో 100కుపైగా వైద్యులు వచ్చి పని చేస్తారని తెలిపారు. శరీరంలో ఏ అవయవం చెడిపోయినా, ఎలాంటి వ్యాధికైనా ఇక్కడే వైద్యం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు, మెడికల్ కాలేజీలు, ఆసరా పెన్షన్లు, ఇతరత్రా పథకాలను ఎవరు కూడా అడగలేదని, పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వారి అవసరాలను తెలుసుకుని పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటున్నారన్నారు. ఇయ్యాల రైతు చనిపోతే రూ.5లక్షలు దినవారం నిండకముందే ఇంటికి వస్తున్నాయని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆపద్బంధు స్కీం కింద రైతు చనిపోతే రూ.50 వేలు ఇచ్చే వారని, అవి కూడా సంవత్సరీకం అయ్యేటప్పుడు వచ్చేవని ఎద్దేవా చేశారు. వస్తే వచ్చినట్లు లేకపోతే లేదని మధ్యలో దళారులు మోపై చివరికి రూ.15 వేలు, రూ.20 వేలు వచ్చేవని, అవి కూడా మొత్తం వచ్చేవి కావన్నారు. ఈ రోజు డైరెక్టుగా ఎల్ఐసీ నుంచి రైతు చనిపోతే నామినీకి రూ.5 లక్షలు వారంలోగా అందజేస్తున్నామని తెలిపారు. రైతు బీమాతోపాటు నేతన్న బీమా కూడా అమలు చేస్తున్నామన్నారు. 59 ఏండ్ల వయస్సు వరకు ఎల్ఐసీ పరిమితి విధించిందని, దీనిని పెంచాలని విజ్ఞప్తులు చేస్తున్నారన్నారు. 59 ఏండ్లు పైబడిన వారికి కూడా ఆర్థిక సాయం అందేలా ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆర్థిక సాయం అందేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పెన్షన్ అందుకున్న వారు చనిపోతే వెంటనే వారి భార్యకో, భర్తకో అందివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. వెంటనే కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్లురాని వారు అధైర్యపడవద్దని, అర్హులైన వారికి ప్రభుత్వం అందిస్తుందని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకునిరాని వారికే వస్తుందని చెప్పాలన్నారు.
ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్షాల నాయకులను నిలదీయండి
రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన ప్రతిపక్షాలు చేసిందేమీ లేదని, వారి మాటలు పట్టించుకోవద్దని సూచించారు. ‘వాళ్లు మీ ఇంటికి వచ్చినప్పుడు వారి పాలనలో ’ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు’ అని నిలదీయాలన్నారు. ‘తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, మరి మీరెందుకు అమలు చేయలేదని’ ప్రశ్నించాలని సూచించారు. ఓట్లప్పుడు వచ్చి ఏదో చెబితే నమ్మవద్దన్నారు. కరీంనగర్ ప్రాంతం, సిరిసిల్ల గడ్డ చైతన్యానికి పెట్టింది పేరని తెలిసేలా నిలదీయాలని చెప్పారు. పని చేసే ప్రభుత్వాన్ని, పని చేసే నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు మందు పోసో, డబ్బులు ఇస్తేనో.. వాటికి ఆగం కావద్దన్నారు. ‘నేను నాలుగు ఎలక్షన్లల్ల నిలుచున్నా.. ఎన్నడూ మందు, పైసలు పంచలేదని, ఇక ముందు కూడా పంచను’ అని తేల్చి చెప్పారు. ‘మీ దయ ఉంటే గెలుస్తా, లేకుంటే ఇంట్ల కూర్చుంటా. మందు పోసి, పైసలు పంచి చిల్లర రాజకీయాలు చేయనని’ పునరుద్ఘాటించారు. ‘మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మంచిగా పని చేస్తా.. బీదా, బిక్కిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా. కుల పిచ్చి, మత పిచ్చి లేకుండా ఎవరికి ఏ అవసరమో, గా పని చేసే బాధ్యత నాది’ అని సభికుల కరతాల ధ్వనుల మధ్య చెప్పారు. ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, టీఎస్‌పీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, ఎన్.ఖీమ్యానాయక్, బీసీ అభివృద్ధి శాఖ అధికారి నీల రాఘవేంద్ర, అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.