కరీంనగర్ కార్పొరేషన్/ గంగాధర, ఆగస్టు 27 : బీఆర్ఎస్ దళం ఆనందపడుతున్నది. రాజకీయ దురుద్దేశంతో మద్యం కేసులో అన్యాయంగా ఇరికించి, అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షిస్తున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కొనలేక, బీజేపీ దొంగచాటుగా దెబ్బతీయాలని చేసిన కుట్ర పటాపంచలైందని, న్యాయమే గెలిచిందని పేర్కొన్నది. ఈ మేరకు మంగళవారం అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు. జగిత్యాలతోపాటు అంతటా స్వీట్లు పంచి, పటాకులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు.
విజయం సాధించారు
ఎదుర్కొనే దమ్ములేకే కేంద్రం కేసీఆర్ కుటుంసభ్యులపై కేసులు బనాయించింది. ఏ ఆధారాలూ లేకుండా ఎమ్మెల్సీ కవితను 165 రోజులు జైల్లో ఉంచింది. ఆలస్యం జరిగినా నిజం, న్యాయం గెలిచింది. ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు. బెయిల్ సాధించి కవిత విజయం సాధించారు. కోర్టుల మీద అవగాహన లేని బండి సంజయ్ సుప్రీం కోర్టు తీర్పును తప్పు పట్టడం సిగ్గు చేటు.
– జగిత్యాలలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
న్యాయస్థానాలపై నమ్మకం పెరిగింది
ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా, రాజకీయ కక్షతో ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవితను 165 రోజులు జైల్లో పెడితే, ఆఖరికి న్యాయమే గెలిచింది. న్యాయస్థానాలపై నమ్మకం పెరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాదులకు, తమ నాయకురాలు తరఫున వాదించిన లాయర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. రాజకీయాల్లో ఇలాంటి కక్షపూరిత కేసులు పెట్టి ప్రతిపక్షాలను బెదిరించడం సిగ్గుమాలిన చర్య. ప్రజలు ఇలాంటి వాటిని హర్షించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– ఒక ప్రకటనలో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
న్యాయానిదే అంతిమ విజయం
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి, ఆగస్టు 27: రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్సీ కవితను మద్యం కేసులో అన్యాయంగా ఇరికించి, అరెస్ట్ చేసినా అంతిమ విజయం న్యాయానికే దక్కిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి, పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నదని చెప్పారు. సంబురాల్లో జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి గారు, కోరుకంటి చందర్ పాల్గొన్నారు.
బెయిల్ రావడం సంతోషం
రాజకీయ కుట్రలు చేసి ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవితను అక్రమంగా జైల్లో ఉంచారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా చివరికి న్యాయమే గెలిచింది. మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు. చాలా సంతోషం.
– మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్