వీర్నపల్లి, జూన్ 27 : అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఏర్పాటు చేసిన కేసీఆర్ కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ మల్లారపు జోత్స్నతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగయ్య కంటి పరీక్షలు చేయించుకొని, కళ్లద్దాలను తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దృష్టి లోపంతో ఎవరు ఇబ్బంది పడవద్దని 2018లో కేసీఆర్ ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు. వీర్నపల్ల్లి మండల ప్రజలు కూడా అంధత్వం బారినపడకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కంటి పరీక్షలు చేయించుకునే వెసులుబాటు లేనివాళ్లు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేటీఆర్ చొరవ.. విశేష స్పందన
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో నిర్వహించిన కేసీఆర్ కంటి వెలుగు శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వీర్నపల్లి క్లస్టర్ పరిధిలో ఎనిమిది గ్రామాల నుంచి మొదటిరోజు 320మంది తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు. సభేరి ఐ హాస్పిటల్కు చెందిన సుమారు 20మంది నిపుణులు పరీక్షలు చేశారు. అవసరమైన వారికి కళ్లద్దాలు అందించగా, ఆపరేషన్ అవసరమైన వారికి సిఫారసు చేశారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సామల దేవరాజు, సర్పంచులు మల్లారపు జ్యోత్స్న, రమేశ్, రవి, శ్రీకాంత్, ఉప సర్పంచ్ జకుల నరేశ్, నాయకులు పాల్గొన్నారు.