సిరిసిల్ల టౌన్, జూలై 9 : ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్‌రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్‌గా మారిపోయాడని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. నాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన ఆయన, రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.
ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడని, అదే తరహాలో బండి సంజయ్ యాక్సిడెంటల్‌గా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నాడని ఎద్దేవా చేశారు. సిరిస్లిల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని కొనియాడారు.
తమ పాలనతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు అని ప్రశంసించారు. రేవంత్‌రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేసి కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే పని పెట్టుకున్నాడని మండిపడ్డారు. డబ్బు సంచులతో నాడు పీసీసీ అధ్యక్ష పదవిని, నేడు ముఖ్యమంత్రి పదవులను కొన్నాడని ఆరోపించారు. ఆయనకు కనీస రాజకీయ పరిణతి గానీ, అవగాహన గానీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన పేరుతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ పొద్దుగడుపుతున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్‌లో ఎవరైనా చర్చకు రావాలని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరి ఢిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి కేటీఆర్ అనేక నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అటువంటి గొప్ప నాయకుడిపై సీతక్క చేస్తున్న విమర్శలకు ప్రజలు ముగింపు పలుకుతారని హెచ్చరించారు. ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగే వ్యక్తులు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. ఆంధ్రాపత్రిక యజమాని రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్ర వినాశనాన్నే కోరుకుంటాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం బాజాప్తా తెలంగాణ బిడ్డల జాగీరేనన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు.
రాష్ట్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదని, అదే తరహాలో ప్రజాపాలన పేరుతో అక్రమ పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డికి సైతం ప్రజలు ఘోరీ కడతారని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, పీఏసీఎస్ చైర్మన్ బండ నర్సయ్యయాదవ్, న్యాలకొండ రాఘవరెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, మ్యాన రవి, కుంబాల మల్లారెడ్డి, గడ్డం భాస్కర్, కంచర్ల రవిగౌడ్, సాయి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.