ఉద్యమాల ఖిల్లా జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించబోతున్నది. హామీల అమలులో వైపల్యమైన కాంగ్రెస్ సర్కారుపై సింహనాదం చేయబోతున్నది. జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియం వేదికగా సోమవారం ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం చేసింది. నిబద్ధత కలిగిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరనుండగా, అందరి చూపూ ఈ సభపైనే నెలకొన్నది.
కేసీఆర్ చేసే దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు వేచి చూస్తుండగా, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి మాట్లాడుతారన్న ఉత్కంఠ ప్రస్తుతం అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’కు తరలివచ్చేందుకు ప్రజానీకం రెడీ అయింది. జగిత్యాల జిల్లాతోపాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే కదులుతున్నది.
కేసీఆర్ మాట ఒక తూటా..బడుగుబలహీన వర్గాలకు బాసట..ప్రజాసమస్యల పరిష్కారానికి అస్త్రం..ప్రజాకంఠక పాలనపై సింహనాదం.. ఉద్యమంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రజల పక్షం..అందుకే ఆయన మాట కోసం అన్ని వర్గాల ఎదురుచూపు..దారులన్నీ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభవైపు..అణచివేత.. అరాచకం..ఇది రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన తీరు..అందుకే అనతికాలంలోనే ప్రజావ్యతిరేకత..అందరిలోనూ సర్కారుపై అసంతృప్తి..‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం..ఇప్పుడీ నినాదమే ఊరూరా రణ నినాదం.. నేటి కేసీఆర్ సభ కోసం కదులుతున్న జనం..
జగిత్యాల, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): అందరి చూపు కేసీఆర్ సభపైనే ఉన్నది. నేడు జగిత్యాలలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఏం మాట్లాడుతారనే చర్చ జరుగుతున్నది. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అనతి కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నది. రెండున్నరేళ్లలో ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్రం సంక్షోభంలో పడిపోయింది. ఇటు ఆ పార్టీలోనూ వివక్షతో సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి ఆత్మగౌరవం, ప్రజాహితం కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరుతుండడం పరిస్థితికి అద్దం పట్టింది.
జీవన్‌రెడ్డి సోమవారం గులాబీ పార్టీలో కేసీఆర్ సమక్షాన చేరుతున్న సందర్భంగా.. జగిత్యాలలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభపైనే ప్రస్తుతం అందరి చూపు నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ‘రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఊరువాడా మారుమోగుతున్నది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా సభ కోసం తరలివచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాల్లో ఇదే నినాదం అందరి నోటా వినిపిస్తున్నది.
సభపై జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఆసక్తి నెలకొన్నది. కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామన్న భావన ఉన్న ప్రజలకు జగిత్యాల సభ ఒక మార్గాన్ని, పోరాట తత్వాన్ని చూపేందుకు వేదికగా నిలుస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాలు సభపై ఉత్సుకత చూపుతున్నాయి. సభా వేదిక మినీస్టేడియానికి నాలుగు రోజులుగా వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి పరిశీలించి వెళ్తుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ఏర్పాట్లు చూసేందుకే నిత్యం వందలాది మంది వస్తుంటే, సభ రోజు ఎంత మంది వస్తారో అన్న చర్చ జగిత్యాలలో జోరుగా సాగుతున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లెకు గులాబీ శ్రేణులు వెళ్లి జగిత్యాల సభకు తరలిరావాలని కోరడంతో పాటు వాహన సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుతం కోతలు ముగిసిపోవడంతో రైతులు, రైతు కూలీలు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే యువకులు, విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు సమావేశానికి భారీ సంఖ్యలో హాజరవుతారన్న సంకేతాలు అందుతున్నాయి. కేసీఆర్ ప్రభకు జీవన్‌రెడ్డి చరిష్మా సైతం తోడు కావడంతో ఇద్దరి సంయుక్త సభ ఎలా ఉంటుందన్న చర్చలు జరుగుతున్నాయి.
రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? ఆయన పదునైన ప్రసంగం సమస్యల పరిష్కారానికి ఏ విధంగా దోహదపడుతుందన్న అభిప్రాయంలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు సభా వేదికగా కేసీఆర్ తమ సమస్యలను ప్రస్తావిస్తే వాటి పరిష్కారం విషయంలో ఏదైనా మార్గం దొరుకుతుందన్న నమ్మకంగా ఆయన ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. వారు సైతం సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధ్దమవుతున్నారు.
మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గం, ఆయన సహచరులు సైతం సభ విజయవంతంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు తమ నాయకుడి కోసం స్వయంగా సమయాన్ని ఇచ్చి, సభను ఏర్పాటు చేసి ఆహ్వానిస్తుండడంతో ఆయా వర్గాల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తున్నది. జీవన్‌రెడ్డి వర్గీయులు, సంబంధీకులు, కార్యకర్తలు, నాయకులు, సహచరులు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చేందుకు, ఇతరులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండున్నరేండ్ల తర్వాత కేసీఆర్ భారీ సభలో పాల్గొంటుండడంతో కీలక వ్యాఖ్యలు చేసే అవకాశాలున్నాయని భావించిన పలు మీడియాల ప్రతినిధులు సైతం జగిత్యాలకు చేరుకుంటున్నారు.
ఇప్పటికే జగిత్యాలలో ఉన్న ప్రైవేట్ లాడ్జిలన్నీ మీడియా ప్రతినిధులు, రాజకీయ విశ్లేషకులు, కేసీఆర్, జీవన్‌రెడ్డి అభిమానులతో నిండిపోయాయి. ఏ లాడ్జిలో చూసిన ‘నో రూమ్స్.. రూమ్స్ నాట్ అవెలెబుల్’ అన్న బోర్డులు కనిపిస్తున్నాయి. వివిధ వృత్తుల వల్ల హైదరాబాద్ ఇతరత్రా పట్టణాల్లో సెటిల్ అయిన జగిత్యాల వాసులు సైతం సభ కోసం స్వగ్రామానికి, పట్టణానికి తిరిగి వస్తున్నారు. కేసీఆర్, జీవన్‌రెడ్డి ఇద్దరు ఒక వేదికపై నుంచి మాట్లాడబోతుండగా, పరిస్థితులు ఎలా ఉంటాయో? ఎమోషన్స్ ఎలా ఆవిష్కృతమవుతాయో? అన్న ఉత్సుకతతో సభ కోసం వచ్చామని చెబుతున్నారు.
భారీ ఏర్పాట్లు
జగిత్యాలలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. నిబద్ధత కలిగిన నాయకుడు జీవన్‌రెడ్డి.. అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతుండగా, ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలను పర్యవేక్షించడానికి నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే నియమించారు. వేదిక వద్ద ఏర్పాట్లు, సభా స్థలి వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వేర్వేరు నాయకులకు బాధ్యతలను అప్పగించారు. జిల్లా నాయకులతోపాటు వీరంతా సభ కోసం వారం రోజులుగా శ్రమిస్తున్నారు. మినీస్టేడియంలో సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కానుండగా, అందుకోసం పదెకరాల విస్తీర్ణంలో షామియానాలు వేశారు.
సభా ప్రాంగణంలో కుర్చీలు, 3 లక్షల మంచినీటి, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రసంగించే వేదికను విశాలంగా, అందంగా ముస్తాబు చేశారు. మినీ స్టేడియం ప్రహరీకి ఐదు వైపులా దారులను తెరిచారు. ఒక దారిని వీఐపీల కోసం, మరోదారిని మీడియా కోసం మిగిలిన మూడు దారులను ప్రజల కోసం సిద్ధం చేశారు. స్టేడియంలోని గుంతలను పూడ్చివేసి చదును చేశారు. వేదిక వద్ద పెద్ద పెద్ద ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. సభ, కేసీఆర్, ఇతర నాయకుల ప్రసంగాలను పట్టణంలోని ప్రజలు ప్రత్యక్షంగా చూసేందుకు వివిధ రోడ్లపై భారీ స్థాయిలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, సభకు గ్రామాల నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ వైపుల నుంచి వచ్చే వాహనాలకు ఆయా రూట్లలో పార్కింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నారు.
పట్టణం గులాబీమయం
సభ నేపథ్యంలో జగిత్యాల పట్టణం ఆదివారం సాయంత్రం వరకు పూర్తిగా గులాబీ వర్ణంలోకి మారిపోయింది. ఎటు చూసినా గులాబీ రంగులో ఉన్న తోరణాలతో కనువిందు చేస్తున్నది. కరీంనగర్ రోడ్డులో ధరూర్ నుంచి మినీస్టేడియం వరకు ఐదు కిలోమీటర్ల దారి పొడవునా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే, తిమ్మాపూర్ చౌరస్తా నుంచి మినీస్టేడియం వరకు, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ నుంచి మినీస్టేడియం వరకు, డీమార్ట్ నుంచి మినీస్టేడియం వరకు ఆరు కిలోమీటర్ల పొడవునా ఫ్లెక్సీలు అడుగడుగునా ఏర్పాటు చేశారు. మినీస్టేడియంలోని వెనుక భాగంతోపాటు, నలువైపులా భారీ ఫ్లెక్సీలను కట్టారు. జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇతర నియోజకవర్గాలు, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు జగిత్యాల జనసంద్రంగా మారిపోతుందన్న అంచనా వేస్తున్నారు.
నేడు కేసీఆర్ జగిత్యాల టూర్ షెడ్యూల్
జగిత్యాల కలెక్టరేట్/ రాయికల్, ఏప్రిల్ 19: జగిత్యాలలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. హెలీకాఫ్టర్లో సాయంత్రం 5.30 గంటలకు జగిత్యాల కలెక్టరేట్లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి వెళ్తారు. అక్కడ పార్టీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభ జరిగే మినీ స్టేడియానికి బయలుదేరి, 6.10 గంటలకు చేరుకుంటారు. అక్కడ సభికులనుద్దేశించి ప్రసంగిస్తారు.
జగిత్యాల సభతో కేసీఆర్ జైతయాత్ర
రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజావ్యతిరేకత మొదలైంది. ‘రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అన్న ఆలోచన వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే ఒకటే మార్గం. ఉద్యమకారుడు కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న. ఆయనతో ఉన్న నా అనుబంధం ఈనాటిది కాదు. కేసీఆర్‌తో నా ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం. సోమవారం జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో ఆయన జైత్రయాత్ర మొదలవుతుంది. కేసీఆర్ మరోసారి సీఎం అవుతరు. ఇది ప్రజాభీష్టం. దీనిని ఎవరూ ఆపలేరు.
– మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి
అన్ని ఏర్పాట్లూ చేశాం
జగిత్యాల మినీ స్టేడియంలో కేసీఆర్ నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఇబ్బందులు రాకుండా వసతులు కల్పించాం. సభ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు. గులాబీ బాస్ ప్రసంగం వినేందుకు, ఆయనను చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎండలను సైతం లెక్కచేయకుండా తరలిరావాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమవుతుంది.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
అంచనాలకు మించి జనం వస్తారు
ప్రజాఆశీర్వాద సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అంచనాలకు మించి తరలివచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ సర్కారు రెండున్నరేండ్లుగా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుండడం, పాలనలో విఫలం కావడంతో కేసీఆర్ ఏం మాట్లాడుతారో..? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగడుతారోనని ఆసక్తిగా చూస్తున్నరు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాం. సభ గురించి కాంగ్రెస్ నాయకులు రకకాలుగా వక్రీకరిస్తున్నప్పటికీ ప్రజల చైతన్యం, ఉత్సాహం ముందు అవేమీ పనిచేయవు. అనుకున్నదానికంటే సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
చరిత్రలో నిలిచిపోతుంది
ప్రజాఆశీర్వాద సభ చరిత్రలో నిలిచిపోతుంది. సభకు వచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘రేవంత్ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ రావాలి’ అనే నినాదం ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో సభకు పెద్ద సంఖ్యలో వచ్చి విజయంతం చేస్తారు. జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం. పార్టీ బలోపేతమయ్యేందుకు, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సభ ఎంతో దోహదపడుతుంది.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
కాంగ్రెస్ పతనం మొదలవుతోంది
జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ వస్తున్నందున జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్ పతనం మొదలవుతుంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలందరికీ అర్థమైంది. యావత్ రాష్ట్రం మొత్తం రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. పల్లె పట్టణం అనే తేడాలేకుండా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్
సభ సక్సెస్ ఖాయం
ప్రజా ఆశీర్వాద సభకు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా వాటన్నింటిని దాటుకుని జనం తరలివచ్చి సభను విజయవంతం చేయడం ఖాయం. ప్రజలు రాకుండా రహదారులను తవ్వినా, బస్సులను అడ్డుకున్నా ట్రాక్టర్లు, ఆటోలు, సొంత వాహనాల్లో స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎడ్ల బండ్లలో సైతం తరలివస్తారు. సభతో బీఆర్ఎస్ జైత్రయాత్ర.. కాంగ్రెస్ పతనం మొదలవుతుంది. గుణపాఠంగా మారుతుంది.
– లోక బాపురెడ్డి, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్