అభివృద్ధి, సంక్షేమంతో గడపగడపకూ చేరువైన బీఆర్ఎస్, రాబోయే ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నది. ఈ నెల 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నియోజకవర్గస్థాయి మినీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించబోతున్నది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో శ్రేణులను కార్యోన్ముఖులను చేయనుండగా.. అందుకు సంబంధించి అన్ని చోట్లా ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు.. ప్రతి ఎమ్మెల్యే, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఈ మినీ ప్లీనరీలను సీరియస్‌గా తీసుకున్నారు. ఒక్కో సమావేశానికి మూడు వేలకు తగ్గకుండా పార్టీ శ్రేణులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. కాగా, సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జిల్లా ప్రతినిధులు పాల్గొననున్నారు.
కరీంనగర్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓవైపు కాంగ్రెస్, బీజేపీ ముడుపులు వ్యవహారంపై ఒకరినొకరు విమర్శించుకుంటుండగా, గులాబీ పార్టీ మాత్రం దూకుడుగా వెళ్తున్నది. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చి.. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపించేందుకు కావాల్సిన వ్యూహాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నది. ఇటు పార్టీ శ్రేణులు, అటు ప్రజలతో మమేకమవుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో చేరువవుతున్నది. ప్రతి పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి, ఆయా గ్రామాల్లోని శ్రేణులను కలుపుకోవడంతోపాటు వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బలమైన పునాది వేస్తున్నది. నిజానికి ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అనుసరిస్తున్న వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీలు బేజారవుతున్నాయి. బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో ఎలా ఢీకొనాలో తెలియక కేవలం ప్రెస్మీట్లతోనే గడుపుతూ, ఆధారంలేని ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కానీ, బీఆర్ఎస్ మాత్రం అందుకు విరుద్ధంగా ముందుకెళ్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో ఊరూరా జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించే విధంగా కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తున్నారు. దాంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చొచ్చుకెళ్తున్నారు. చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు.
Karimnagar1
ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27న ఉన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ రోజు ప్లీనరీ సమావేశాలు గతంలో హైదరాబాద్‌లో.. అదీ ఒకే చోట మాత్రమే జరిగేవి. కానీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఆవిర్భావోత్సవానికి ముందుగానే అంటే ఈ నెల 25న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నియోజకవర్గస్థాయి మినీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు, ప్రతి నియోజకవర్గంలో మూడువేలకు తగ్గకుండా పార్టీ శ్రేణులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ఆ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరికి వారే తమ తమ నియోజకవర్గాల్లో మినీ ప్లీనరీలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఫంక్షన్ హాల్స్, ఇతర వేదికలు సిద్ధం చేశారు. వచ్చిన వారికి భోజన వసతి, ఇతర సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వేదిక ద్వారా కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయాల్సిన తీరు, ప్రతిపక్షాల విమర్శలు, తిప్పికొట్టాల్సిన అవసరం, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, మారిన పట్టణ, గ్రామీణ రూపురేఖలు, విద్య, వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్న తీరు, గడపగడపకూ అందిన కేసీఆర్ ఫలాలు, వాటి గురించి ప్రజలకు వివరించాల్సిన తీరు తెన్నుల వంటి అనేక అంశాలపై ఈ వేదిక ద్వారా నిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో కనీసం ఆరు అంశాలకు తగ్గకుండా తీర్మానాలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. దాంతో ఆయా నియోజకవర్గాల్లో కనీసం పదికి తగ్గకుండా తీర్మానాలు చేసేందుకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేసుకున్నాయి.
ఊరూరా జెండావిష్కరణ
మినీ ప్లీనరీలే కాదు, ఇదే సమయంలో ఊరూరా గులాబీ జెండా ఎగుర వేయడానికి ఇప్పటికే పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రతి గ్రామంలో జెండా ఎగురవేయనున్నారు. ఆయా గ్రామాలకు చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు ముందుగా పార్టీ జెండాను గ్రామ వీధులు, కూడళ్లలో ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీలుగా కొంత మంది, ఇతర విధానాల్లో మరికొంత మంది ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే మినీ ప్లీనరీ సభాస్థలికి చేరుకుంటారు. అన్ని గ్రామాల నుంచి రాగానే నియోజకవర్గస్థాయి సమావేశం ప్రారంభిస్తారు. ఊరూరా జెండా ఎగుర వేసేందుకు రెండు మూడు రోజులుగా కసరత్తు చేశారు. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న జెండా గద్దెలకు రంగులు వేశారు. గద్దెలు లేని చోట కొత్తగా నిర్మించారు. పల్లె నుంచి నియోజకవర్గస్థాయి వరకు.. గులాబీ జెండా ఎగుర వేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లోనూ గ్రామ కమిటీలు ఇప్పటికే చురుకుగా పాల్గొంటున్నాయి. పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి.
నేటి బీఆర్ఎస్ మినీ ప్లీనరీ సమావేశాలు, హాజరు కానున్న అతిథుల వివరాలు
సిరిసిల్ల : సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరులోని అప్పారెల్ పార్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హాజరవుతారు. సుమారు 5 వేల మంది ప్రతినిధులకు సరిపడా ఏర్పాట్లు చేశారు.
వేములవాడ : వేములవాడ-జగిత్యాల రోడ్డు పరిధిలోని మహరాజా ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు హాజరవుతారు. రెండు నుంచి మూడు వేల శ్రేణులకు ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ : కరీంనగర్ రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథిలుగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరవుతారు. మూడువేల మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు.
మానకొండూర్ : మానకొండూరులోని సుప్రీమ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరవుతున్నారు. రెండు నుంచి మూడువేల మందికి ఏర్పాట్లు చేశారు.
హుజూరాబాద్ : హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి హాజరవుతారు. రెండు నుంచి మూడువేల మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు.
చొప్పదండి : గంగాధర మండలం మధురానగర్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరవుతారు. ఇక్కడ రెండు నుంచి మూడు వేల మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు.
హుస్నాబాద్ : పోతారం శుభం గార్డెన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పాల్గొంటారు.
జగిత్యాల : జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా పరిశీలకులు దామోదర్‌గుప్తా పాల్గొంటారు. ఇక్కడ రెండు నుంచి మూడువేల మందికి ఏర్పాట్లు చేశారు.
కోరుట్ల : మెట్పల్లి పట్టణ సమీపంలోని వీఆర్ఎం గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జిల్లా ఇన్చార్జి కోలేటి దామోదర్ గుప్తా పాల్గొంటారు. ఇక్కడ రెండు నుంచి మూడువేల మందికి ఏర్పాట్లు చేశారు.
ధర్మపురి : ధర్మపురిలోని ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో ఉదయం10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొంటారు. ఇక్కడ మూడు వేల మందికి ఏర్పాట్లు చేశారు.
రామగుండం: గోదావరిఖని జీఎం ఆఫీస్ కాలనీ గ్రౌండ్ వద్ద ఉద యం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగాబీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, మండలి చీఫ్‌విప్ టీ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరవుతారు. దాదాపు మూడువేల మందికి ఏర్పాట్లు చేశారు.
పెద్దపల్లి : పెద్దపల్లిలోని రైల్వే స్టేషన్ రోడ్‌లోని ట్రినిటీ హైసూల్ గ్రౌండ్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, మండలి చీఫ్‌విప్ టీ భాను ప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొంటారు.
మంథని : మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అతిథులుగా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, మండలి చీఫ్‌విప్ టీ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ రమణ, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొంటారు. ఇక్కడ రెండు నుంచి మూడు వేల మందికి ఏర్పాట్లు చేశారు.