గోదావరిఖని, మే 3 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత కేసీఆర్ రోడ్‌షో ప్రారంభమైంది. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోకు రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి ప్రజలు, సింగరేణి కార్మికులు, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఇల్లందు గెస్ట్‌హౌస్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం కాగా, మహిళలు దారిపొడవునా కేసీఆర్‌కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కళాకారులు, యువకులు, అభిమానులు ర్యాలీగా వచ్చారు. తమ నీటి కష్టాలు తీర్చిన నేతకు కాళ్లు కడుగాలని బసంత్‌నగర్ వాసులు వచ్చారు.
అభిమాన నేత కోసం కదలివచ్చిన సింగరేణి కార్మికులు, ప్రజలు ‘కేసీఆరే కావాలి.. కేసీఆరే రావాలి’ నినదించారు. ‘సీఎం జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. పలు సందర్భాల్లో కేసీఆర్ వద్దని వారించినా.. ప్రజలు మాత్రం ఆపలేదు. చౌరస్తాకు చేరుకున్న అనంతరం బస్సుపైకి కేసీఆర్ రాగానే.. గోదావరిఖని మొత్తం ధ్వనించేలా ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.. ‘మా సీఎం మీరే’ అంటూ నినాదాలతో మార్మోగించారు. కేసీఆర్ రోడ్డు షో సందర్భంగా గోదావరిఖని మొత్తం గులాబీమయం అయింది. అనంతరం 28 నిముషాల పాటు ఉద్వేగభరితంగా కేసీఆర్ ప్రసంగించగా.. ప్రజలు ఎంతో ఆసక్తిగా విన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువాల్సిన ఆవశ్యకత ఎంత ముఖ్యమో వివరించి చెప్పారు. మన నీళ్లు, నిధులు, హక్కులు, ముఖ్యంగా సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు కచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పినప్పుడు ప్రజల నుంచి స్పందన వచ్చింది.
ప్రధానంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై పలు ప్రశ్నలు సంధించడం ఆలోచింప జేసింది. కేసీఆర్ ఒకవైపు జోకులు వేస్తూ.. మరోవైపు నవ్వుతూ.. నవ్విస్తూ ప్రశ్నలు అడిగిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. సమైక్య పాలనలో సింగరేణికి జరిగిన నష్టం.. బీఆర్ఎస్ హయాంలో కార్మికులకు కల్పించిన హక్కులు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని కేసీఆర్ వివరించడంతో కార్మికులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. సింగరేణిలో 26 ఏండ్లపాటు కార్మికుడిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లి ఎంపీగా అవకాశం కల్పించాలని కోరారు. మొత్తంగా రోడ్ షో సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. కేసీఆర్ ప్రసంగం మరింత ఊపు తీసుకువచ్చింది. దీంతో కార్యకర్తలు నూతనోత్సహంతో వెనుదిరిగారు. పెద్దపల్లి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు.