కరీంనగర్ కార్పొరేషన్/ కలెక్టరేట్, ఏప్రిల్ 20 : గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు చెంపపెట్టులాంటి తీర్పునిస్తారని జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీల పాలన చూసిన తెలంగాణ ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలన నాటి సమైక్యవాదుల తీరును గుర్తుకుతెస్తోందనే చర్చ ప్రజల్లో జరుగుతున్నదన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ బీజేపీ పాలనలో కేంద్రం నుంచి జిల్లాకు తెచ్చిన నిధులు శూన్యమని విమర్శించారు.
శనివారం ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సాదాసీదాగా నామినేషన్ వేశారు. అంతకు ముందు నగరంలోని వరాహస్వామి దేవాలయంలో కుటుంబసభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత బీఆర్ఎస్ నాయకులతో తన నివాసానికి చేరుకొని శ్రేణులతో కలిసి మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మైనార్టీ నాయకుడు జమీలొద్దీన్తో కలిసి రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లోనూ కాంగ్రెస్, బీజేపీ టీఆర్ఎస్కు మోకాలడ్డాయని ఆరోపించారు.
ఐదుగురు ఎంపీలతో తెలంగాణ తెస్తారా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడితే, యావత్ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా పోరాడామని గుర్తు చేశారు. 32 పార్టీలను ఏకం చేసి 28 పార్టీల నుంచి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు తెచ్చి, విమర్శకుల నోళ్లు మూయించామన్నారు. ఎన్నో పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధ్ధి చేయడంపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆ పార్టీల వ్యవహార శైలితోనే మన రాష్ర్టానికి రావాల్సిన విద్యా వనరులు దూరమయ్యాయని ధ్వజమెత్తారు. అటు నవోదయ విద్యాలయాలు రాలేదని, ఇటు వైద్య రంగంలో అత్యున్నతమైన ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ సంస్థ కరీంనగర్ జిల్లాకు రాకుండా పోయిందని వాపోయారు. ఏయిమ్స్ ఏర్పాటుకు రేకుర్తి-కొత్తపల్లి మధ్య 50 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయిస్తున్నట్టు ప్రతిపాదనలతో ఢిల్లీకి వెళ్లి సంబంధితాధికారులకు అప్పగించామన్నారు.
అయితే, అప్పటికే ఎన్నికల షెడ్యూల్ రావడం, తాను ఓటమి పాలు కావడంతో ఆ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదని, అనంతరం గెలిచిన ఎంపీ కూడా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాకో నవోదయ పాఠశాల రావాల్సి ఉన్నా ఇప్పటివరకు ఏర్పాటుకు అనుమతులు తేలేని దుస్థితి తెలంగాణ బీజేపీలో నెలకొందన్నారు. ఈ రెండు పార్టీల తీరుతోనే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదని విమర్శించారు. అందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని సామాజిక వర్గాలకు అనువుగా గురుకులాలు ఏర్పాటు చేసి, విద్యారంగ పురోగతి కోసం పాటుపడినట్లు గుర్తు చేశారు. ఉద్యమకారులకు మాత్రమే తెలంగాణ అభివృద్ధిపై స్పృహ ఉంటుందనే ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు. తనను గెలిపిస్తే కేంద్రంలో ఏపార్టీ అధికారంలో ఉన్నా పోరాడి నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నీటి మూటలే. నాలుగు వేల కోట్లతో మైనార్టీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి, నాలుగు రూపాయలు కూడా విడుదల చేయలేదు. మైనార్టీ సబ్‌ప్లాన్ కూడా అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే మైనార్టీలకు పెద్దపీట వేసి, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. రాబోయే ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశాలున్నట్లు మొదటి విడుత ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. పార్లమెంటులో తెలంగాణ అభివృద్ధి కోసం గొంతుకగా మారే వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాలి.
– మైనార్టీ నాయకుడు జమీలొద్దీన్
బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పని చేయాలి. తప్పకుండా మనమే గెలుస్తం. తెలంగాణ కోసం ఆలోచించే వారు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరమున్నది. నన్ను గెలిపిస్తే కరీంనగర్‌తోపాటు రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడుత. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా నిధులు తీసుకొస్త. కరీంనగర్ పార్లమెంట్‌ను అభివృద్ధి చేస్త. హామీలు ఇచ్చుడే కాదు, వాటిని అమలు చేసి చూపిస్త. చెప్పినట్టే కేబుల్ బ్రిడ్జిని నిర్మించినం. మొన్నటిదాకా మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా నడిచినయి. ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిపోయినయి. నేను ఓడిపోవడంతో నవోదయ, ట్రిపుల్ ఐటీ పట్టించుకునే నాథుడు లేడు. ఇప్పుడు ఎంపీగా ఉన్న సంజయ్ వాటి గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు.
– బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్తోనే సాధ్యం. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఒక్కొక్కటిగా అటకెక్కిస్తున్నది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న ఆ పార్టీపై రైతులు, సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నరు. కరీంనగర్ పార్లమెంట్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. మొదటి స్థానంలో బీఆర్ఎస్, రెండోస్థానంలో బీజేపీ ఉండబోతున్నది. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం కానున్నది. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో పదేళ్లు వెనక్కు వెళ్లే పరిస్థితులు మొదలైనయి. మానేరు రివర్ ఫ్రంట్ పనులతోపాటు అనేక అభివృద్ధి పనులు మూలనపడ్డయి. వీటిని తిరిగి ప్రారంభించాలంటే మాట్లాడే గొంతుక అవసరం.
– కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మొట్టమొదటగా గెలువబోయే సీటు కరీంనగరే. వందకు నూటొక్క శాతం వినోద్‌కుమార్ గెలిచి, పార్లమెంటులో అడుగుపెడుతరు. ఇంగ్లిష్, హిందీ రాని బండి సంజయ్‌ని పార్లమెంటుకు పంపితే ఏం ప్రయోజనం ఉండదు. కేంద్రంలో బీజేపీం ప్రభుత్వం ఉన్నా ఆయన ఐదు కొత్తలు కూడా తేలే. దీనిని ప్రజలు గమనించాలి. అద్భుత వాగ్దాటితో పార్లమెంటులో ఇక్కడ పరిస్థితులపై తన గొంతుకను వినిపించే వినోద్‌కుమార్‌ను గెలిపించాలి.
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
అంబేద్కర్ స్ఫూర్తితో పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై అనర్గళంగా మాట్లాడే వ్యక్తి వినోద్‌కుమార్. ఆయన ఎంపీగా గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి సాధ్యమైతది. పేదోళ్లకు పెరుగన్నంలా ఉండే వినోద్ గెలుపు కోసం బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏకమై కృషి చేయాలి. ప్రస్తుత కరీంనగర్ ఎంపీ ఎన్నడు కూడా ఇక్కడి సమస్యలపై పార్లమెంటులో మాట్లాడిన పాపాన పోలేదు. కేవలం కులం, మతం పేరిట చిచ్చు పెడుతూ, దేవుడి పేరిట రాజకీయం చేయడం తప్ప చేసిందేమీ లేదు. ఐదేళ్లకోసారి వేసే అడ్వైర్టెజ్ మెంట్ పేపర్‌లాగా సంజయ్ మారిండు. ఏ ఒక్కనాడు కూడా ప్రజల వద్దకు వెళ్ళిన దాఖలాలు లేవు. ఆయనను ప్రజలు గుర్తు పట్టే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో మోసం చేసింది. 60 లక్షల పైచిలుకు ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. కనీసం పార్లమెంటులో పోటీ చేసే అవకాశం కూడా కల్పించలేదు.
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్