గన్నేరువరం, ఏప్రిల్ 22: ఉపాధి హామీ కూలీల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి డాక్టర్ మాధవి కోరారు. సోమవారం మండలంలోని గన్నేరువరం, పారువెల్ల, ఖాసీంపేట, జంగపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 100 రోజులు దాటినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. అభివృద్ధి చేసే నాయకుడైన బోయినపల్లి వినోద్ కుమార్‌ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అంతకుముందు ఖాసీంపేట మానసాదేవి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షడు గంప వెంకన్న, నాయకులు ఆంజనేయులు, మోహన్ రెడ్డి, న్యాత సుధాకర్, పుల్లెల లక్ష్మణ్, తిరుపతి రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 22: చెర్లభూత్కూర్‌లోని మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శకటోత్సవానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ సతీమణి డాక్టర్ మాధవి హాజరయ్యారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న యువకులతో డా. మాధవి మాట్లాడారు. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు వినోద్‌కుమార్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి, వినోద్‌కుమార్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, కూర శ్యాంసుందర్‌రెడ్డి, చింతల లక్ష్మణ్, బుర్ర తిరుపతి, మాసగోని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.