MLA Sanjay | కోరుట్ల, ఆగస్టు 19: ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రగతి కుంటుపడిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం ఆదాయం మార్గాలు లేక వెనుక పడిపోయిందన్నారు. కరోనా కష్ట కాలంలోను పెన్షన్లు అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించి కల్లబొల్లి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని సీఎం నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి ప్రజలు ఓటు వేశారని, ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, నాయకులు పహీమ్, నత్తి రాజకుమార్, సురేందర్, గంగాధర్, ఆనంద్, అంజయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.