కరీంనగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం ఏమిటని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పూర్తిగా పోలీసు రాజ్యం చేస్తున్నారని విమర్శించారు. అయినా ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారని, ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెచ్చగొడితేనే ఆయన నిలదీశారని, ప్రశ్నించినంత మాత్రాన సమావేశాల నుంచి లాకెళ్తారా.. కేసులు పెడతారా? అని మండిపడ్డారు.
రేపు మరో ఎమ్మెల్యే మాట్లాడినా ఇదే పరిస్థితి ఉంటుందా? అని అడిగారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి తమను ఆహ్వానిస్తేనే వెళ్లామని, ఆహ్వానించి ఈ రకంగా అవమానిస్తారని అనుకోలేదని వాపోయారు. కరీంనగర్‌లోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం కలెక్టరేట్లో జరిగిన ఘటనను వివరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా తమను మాట్లాడాలని కోరినప్పుడు కొత్తగా అమలు చేస్తున్న నాలుగు పథకాల్లో ఉన్న లోపాలు, అమలు చేయాల్సిన విధానాలను ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేశామన్నారు.
వారి నుంచి తమకు స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. ఒక ఎమ్మెల్యేగా కౌశిక్‌రెడ్డి కూడా రైతు భరోసా, దళిత బంధుపై ప్రశ్నలు వేశారని, వీటికి కూడా సమాధానం రాలేదన్నారు. చివరికి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన గొడవను కూడా మంత్రులు పట్టించుకోకపోవడం దురదృష్టకమని అన్నారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జీవన్‌రెడ్డి లాంటి నాయకులు తమను ఇదే విధంగా నిలదీశారని, వారికి సరైన సమాధానాలు చెప్పామే తప్ప కేసులు పె ట్టామా..? అని గుర్తు చేశారు. శాసన సభలోనూ ఎంత పెద్ద గొడవ జరిగినా స్పీకర్ అనుమతి లేకుండా మార్షల్స్ ఎమ్మెల్యేలను ముట్టుకోరని, అలాంటిది ఇక్కడ కౌశిక్‌రెడ్డిని పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.
వేదికపై ఉన్న మంత్రులు జోక్యం చేసుకుంటే ఇద్దరినీ కంట్రోల్ చేసే అవకాశం ఉండేదన్నారు. తాను కౌ శిక్ రెడ్డిని ముట్టుకోవద్దని ఎంత చెప్పినా వినకుండా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, దౌర్జన్యంగా లాక్కెళ్లారని వాపోయారు. ఆయన తప్పు లేకపోవడం వల్లనే ‘సీఐ గల్లా పట్టినట్టు కేసు పెట్టాలి’ అని ఒక మంత్రి నిన్న చెబుతున్నట్టు తెలుస్తున్నదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేశ్, తోట రాములు, తుల బాలయ్య, నాయకులు గందె మహేశ్, సుంకిశాల సంపత్ రావు, రెడ్డవేణి మధు, పిల్లి మహేశ్, ఒంటెల సత్యనాయరణ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్యే అని చూడకుండా లాక్కెళ్తారా..?
రివ్యూ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ పక్క పక్కనే కూర్చున్నరు. కౌశిక్‌రెడ్డి మాట్లాడి కూర్చున్న తర్వాత బీఆర్ఎస్ నాయకుల బట్టలు విడిపిస్తానని సంజయ్ రెచ్చగొట్టేలా మాట్లాడినట్టు కౌశిక్ నాతో చెప్పిండు. అందుకే సంజయ్ మాట్లాడే ముందు ‘నీది ఏ పార్టో చెప్పి మాట్లాడాలి’ అని కౌశిక్‌రెడ్డి నిలదీసిండు. ఇద్దరి మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమే. అయితే వీరిద్దరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు లేదా? అధికారిక మీటింగ్‌లోకి పోలీసులు ఎలా వచ్చారు? ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మంత్రుల కళ్లెదుటే గొర గొరా ఎలా లాక్కెళుతారు? మంత్రులే పోలీసులకు అనుమతి ఇచ్చారా..? వారి అనుమతితో లాక్కెళితే ఆ ముగ్గురు మంత్రులు కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలి.
– గంగుల కమలాకర్