బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధినేత ఒక్కొక్కరిని పేరుపేరునా పలుకరించి, గెలుపు మీదేనని అభయమిచ్చారు. బీఆర్ఎస్కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, అందరూ కష్టపడి విజయం సాధించాలని సూచించారు.
జగిత్యాల/రాజన్న సిరిసిల్ల/పెద్దపల్లి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం సాయంత్రం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంత్రి గంగుల ఆధ్వర్యంలో వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, హుజూరాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కొక్కరిని పేరు పేరునా ముఖ్యమంత్రి పలుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్కు అనుకూలమైన సరిస్థితులు ఉన్నాయని, అందరూ కష్టపడి ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు.
కరీంనగర్‌లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. ఎక్కడైనా కార్యకర్తల్లో అసంతృప్తి ఉంటే అందరితో మాట్లాడి కలుపుకొని వెళ్లాలని మంత్రికి సూచించారు. అలాంటి పరిస్థితులు ఉన్నచోట తప్పకుండా మాట్లాడి సమన్వయం చేస్తానని మంత్రి సీఎంతో చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ కల్వకుంట్ల, పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ఉన్నారు.
రసమయి.. నీకు భారీ మెజార్టీ ఖాయం
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆయనతో మాట్లాడుతూ ‘రసమయి.. నువ్ మూడోసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నావ్.. అత్యధిక ఓట్లు వస్తాయి” అంటూ భుజం తట్టి అభినందించారు.
సీఎంను కలిసిన పుట్ట, దాసరి
సీఎం కేసీఆర్‌ను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి వేర్వేరుగా కలిశారు. తమకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా అవకాశం కల్పించిన కేసీఆర్, మధూకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ప్రభుత్వ విప్ బాల సుమన్, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జకు శ్రీహర్షిణి, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నేత జకు రాకేశ్, మారెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ఉన్నారు.
మధు నన్ను పర్సనల్‌గా కలువు
“మధు నువ్వు వచ్చి నన్ను పర్సనల్‌గా కలువు.. మంథనిలో నీపై ఏ విధంగా కుట్ర జరుగుతున్నదో ఇంటలిజెన్స్ ద్వారా తెలిసింది. ఎవరెన్ని కుట్రలు చేసినా నీ విజయం తథ్యం” అంటూ సీఎం కేసీఆర్ పుట్ట మధుకు సూచించారు. గురువారం తనను కలువాలని, నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలపై పూర్తి సమాచారంతో రావాలని సూచించారు.
కాటారం రెవెన్యూ డివిజన్‌పై సీఎం సానుకూలం
కాటారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించినట్లు భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జకు శ్రీహర్షిణి రాకేశ్ తెలిపారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసిన సందర్భంగా కాటారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరగా తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
రుణపడి ఉంటా
మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారని, ఎల్లప్పు డూ పార్టీకి రుణపడి ఉంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని, కష్టపడితే భారీ మెజార్టీతో ముచ్చటగా మూడోసారి విజయం నీదేనని సీఎం, దాసరిని అభినందించారు.