MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, జనవరి 29 : కోరుట్ల పట్టణంలోని 8, 9వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు యువకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక 9వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి గండ్ర శిల్పారావు ఆధ్వర్యంలో 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పట్టణంలోని 8వ వార్డుకు చెందిన తోట గంగాధర్ తో పాటూ మాజీ కౌన్సిలర్ హమీద్, 20 మంది యువకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గులాభీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాభీ జెండా ఎగురడం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రవేశపెట్టిన పథకాలు తప్ప ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడ నేరవేర్చలేదన్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మళ్లీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో యువకుల చేరిక భవిష్యత్ రాజకీయాలకు శుభ పరిణామమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరడం జరుగుతుందని తెలిపారు. కోరుట్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, మాజీ కౌన్సిలర్ పోగుల ఉమారాణి, నాయకులు గడ్డం మధు, బైరి విజయ్, బొమ్మ రాజేశం, బాబా, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.