గంగాధర, మార్చి 17: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దిష్టిబొమ్మలను దహనం చేసిన దానికి నిరసనగా సోమవారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డి చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నవీన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు.
ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపినందుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను వేధించడం మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నాయకులు కంకణాల విజేందర్ రెడ్డి, మడ్లపల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎండీ నజీర్, ముక్కెర మల్లేశం, రామిడి సురేందర్, ఆకుల శంకరయ్య, శ్రీమల్ల మేఘరాజు, వడ్లూరి ఆదిమల్లు, పొట్టల కనకయ్య, బొల్లాడి శ్రీనివాసరెడ్డి, పుటుకం రవీంద్రనాథ్ ఠాగూర్, దోమకొండ మల్లయ్య, గంగాధర మోహన్ తదితరులు పాల్గొన్నారు.