BRS leaders | చిగురుమామిడి, ఆగస్టు 23: రైతన్నలు యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు చిగురుమామిడి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నాయకులు శనివారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంటసేపు కరీంనగర్, హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై సాయికృష్ణ రాస్తారోకో విరివింపజేయాలని బీఆర్ఎస్ నాయకులను కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించనిదే ధర్నా విరమించేది లేదని నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు, నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్, తోపులాట
రాస్తారోకో విరమించాలని ఎస్సై సాయి కృష్ణ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్యను కోరగా వారు ససేమిరా అంగీకరించకపోవడంతో పోలీసులు వారిని ఎత్తుకొని వాహనాలలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే నాయకులు పోలీసుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తి విఫలమైందని వారు ఆరోపించారు.
కేంద్ర రాష్ట్ర పనితీరును ఎండగడతాం : కొత్త శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకుడు
రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను ప్రజల్లో ఎండగడతామని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య మండిపడ్డారు. రాస్తారోకో అనంతరం వారు మాట్లాడుతూ 20 రోజులుగా అన్నదాతలు యూరియా కోసం అరిగోసపడుతున్నారని, సాగు పనులు వదులుకొని యూరియా కోసం కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా వచ్చిందని సమాచారం తెలిస్తే రైతులు వెంటనే వెళ్లి యూరియా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారని వాపోయారు. ఉదయం నుండి కేంద్రాల వద్ద క్యూలో ఉండాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నెలకొందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా కేసీఆర్ చేశారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని యూరియా సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకోలో మాజీ వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, ఆర్బీఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షలు కృష్ణమాచారి, పెసరి రాజేశం, సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, కరివేద మహేందర్ రెడ్డి, కత్తుల రమేష్, బుర్ర తిరుపతి, సన్నీల వెంకటేశం, ఒంటెల కిషన్ రెడ్డి, పిల్లి వేణు, తోడేటి శ్రీనివాస్, బిల్ల వెంకట్ రెడ్డి, బెజ్జంకి లక్ష్మణ్, ముక్కెర సదానందం, మిట్టపల్లి మల్లేశం, మహంకాళి కొమురయ్య సందీప్ రెడ్డి, కొమ్మెర భూపతిరెడ్డి, గౌరీ శంకర్, సాగర్ రెడ్డి, కూతురు శరబంద రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, సారంగం, గౌరీ శంకర్, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.