జగిత్యాల, జూన్ 29 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి ఈ ముప్పై నెలల కాలంలో చేసిందేమీ లేదని, గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయడమే తప్ప కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, సభ్యత్వ నమోదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని, సీఎం అయ్యేది కేసీఆరేనని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను గెలిపించుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని, ప్రజలకు మేలు జరుగుతుందని, పార్టీ కార్యకర్తలు, నాయకులకు గౌరవం, మర్యాద ఉంటాయన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా చూడాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. వచ్చే నెల 7న సర్‌తో పాటు పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తోపాటు పట్టణ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1980, 2002లో నిర్వహించిన సర్ కార్యక్రమాల్లో ఓటర్లు ఉన్నారా.. లేదా..? అని మాత్రమే పరిశీలించి, డూప్లికేట్ ఓటర్లను తొలగించారని, అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న ఓటర్ మ్యాపింగ్ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నదన్నారు. జగిత్యాల పట్టణానికి ఉపాధి నిమిత్తం చాలా మంది వలస వచ్చి స్థిరపడ్డారని, సర్‌పై అవగాహన లేకుంటే వలసవచ్చిన వారి ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు.
ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2002కు ముందు సంబంధించిన ఓటు వివరాలను బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుసుకొని వలస వచ్చి స్థిరపడిన ఓటర్లకు సాయం చేయాలని సూచించారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్లో పేరు తొలగించిన వారికి సలహా ఇచ్చేందుకు బీఆర్ఎస్ జగిత్యాల పట్టణ శాఖ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యకర్తలు, వార్డుల్లో పర్యటించాలని, ఓటర్లకు తోడుగా నిలవాలన్నారు. నేడు ప్రజాస్వామ్య అర్థాన్ని కొందరు స్వార్థపరులు మార్చివేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మాట్లాడుతున్నారని, అలా అనుకుంటే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండవని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా ఉండాలని భావిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదా..? అని ప్రశ్నించారు. 2014లో ఉమ్మడి కరీంనగర్లో తాను ఒకడినే గెలిచానని, అప్పటి సీఎం కేసీఆర్‌కు విన్నవించి, బోర్నపల్లి వంతెన కోసం రూ.70 కోట్లు మంజూరు చేయించినట్టు గుర్తుచేశారు. అప్పుడు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి కోసం అంటూ అధికార పార్టీలోకి వెళ్లలేదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సీఎంతో కలిసి పని చేయవట్టి రెండేళ్లు గడుస్తున్నా జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం గుర్తించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అధికారం కోసం కాంగ్రెస్‌లో చేరిండని, కానీ, తాను ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు అధికార పార్టీని విడిచిపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరానని చెప్పారు.
ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి అధికార పార్టీలో కొనసాగే అలవాటు తనకు లేదన్నారు. జగిత్యాల మున్సిపల్ పూర్తిగా కేంద్రీకృత అధికారం అయిపోయిందని, పవర్ మొత్తం ఎమ్మెల్యే చేతిలోకి పోయిందని, పాలకవర్గం ఉత్సవ విగ్రహంగా మారిందని విమర్శించారు. జగిత్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేటీఆర్ మంజూరు చేసిన నిధులకు సంబంధించినవేనని గుర్తుచేశారు. పనులన్నింటినీ గ్రూపింగ్ చేస్తూ, స్థానికుల కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా ఎమ్మెల్యే బినామీకి, బంధువులకు అప్పజెబుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు 12 మంది కౌన్సిలర్లు ఉన్నారని, అందరు ఒక్కతాటిపై నిలబడితే మున్సిపల్లో అవినితీని అడ్డుకోవచ్చన్నారు. యావర్‌రోడ్డుపై పెట్రోల్ పంపు 4 గుంటల్లో పెట్టి, మిగిలిన భూమి ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారని, కిబాలా పత్రం ఇంతవరకు బయటకు రాలేదన్నారు.
ప్రభుత్వ భూములు కాపాడడం అభివృద్ధి కాదా..? అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, పార్టీ పట్టణాధ్యక్షడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్స్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, దేశాయి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జీనత్ పర్వీన్ మున్నా, నాయకులు తాటిపర్తి రాంచంద్రా రెడ్డి, శీలం ప్రవీణ్ కుమార్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ధర రమేశ్ బాబు, గాజుల రాజేందర్, కల్లేపెల్లి దుర్గయ్య, శివ కేసరి బాబు, కోరుకంటి రాము, ప్రదీప్, సామల జమున రాజశేఖర్, తోపారపు లావణ్య రజినీకాంత్, పుప్పాల అశోక్ ఉన్నారు.
వచ్చేది బీఆర్ఎస్ సర్కారే
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే చాలు తొకుకుంటా పోతా అంటున్నడు. విచిత్రంగా, అసహ్యంగా మాట్లాడుతున్నడు. ఆయన తొక్కేది అసలు కాంగ్రెస్ పార్టీనే. ఆయన కాంగ్రెస్‌తో కొనసాగే వ్యక్తి కాదు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. సీఎం అయ్యేది కేసీఆరే. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ర్టానికి భవిష్యత్. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహానుభావుడు ఆయన. బీఆర్ఎస్ హయాంలో తర్వాత పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా చేసిండు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిండు. బలహీనవర్గాల కోసం బీసీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకులాలను ప్రారంభించిండు. అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి.
– జీవన్‌రెడ్డి
సర్‌పై దృష్టి పెట్టాలి
సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గోడమీద పిల్లిలా కాంగ్రెస్‌లో చేరిండు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమైంది. కార్యకర్తలు, నాయకులు సర్‌పై దృష్టి పెట్టాలి. అర్హుల ఓట్లు పోకుండా చూడాలి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. జీవన్ రెడ్డి సహకారం తో పార్టీ సభ్యత్వం రికార్డు స్థాయిలో చేద్దాం.
– దావ వసంత, జడ్పీ మాజీ చైర్ పర్సన్