రాయికల్, జూలై 14 : రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య కిట్లను నామమాత్రంగా పంపిణీ చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఏడాదిలోగా ఇవ్వాలని కిట్లను ఏడాదికో గ్రామంలో పంపిణీ చేస్తున్నారని, ఇట్లయితే ఎన్నేళ్లు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. అందరికీ రావాలంటే ఇంకా పదేళ్లు పడుతుందని చెప్పారు. రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్‌లో తాటిచెట్టుపై నుంచి పడి గాయపడ్డ తిరుపతిగౌడ్ను మంగళవారం ఆయన పరామర్శించి, విలేకరులతో మాట్లాడారు. గీత కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కాటమయ్య కిట్ల పంపిణీ ప్రారంభించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంపిణీని నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
తాటి చెట్టుపై నుంచి పడిన కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెట్టు పైనుంచి పడితే డాక్టర్ సర్టిఫికెట్ ఎవరూ ఇవ్వరని, కనీసం రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.ఐదు లక్షలు, మరిణిస్తే రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. మరోవైపు గీత కార్మిక వృత్తిపై ఆధారపడ్డ వారికి బెల్టు షాపులు అవరోధంగా మారాయని, గ్రామానికి పదికి తక్కువగా లేవని, అర్ధరాత్రి ఫోన్ చేస్తే నిర్వాహకులు ఎక్కడికైనా తీసుకువచ్చి ఇస్తున్నారని, పోలీస్ శాఖ కళ్లకు గంతలు కట్టుకున్నట్టు చేస్తున్నదని ధ్వజమెత్తారు. తాగించేది.. తర్వాత మూతి దగ్గర పైపు పెట్టేది పోలీస్ శాఖనేనని ఎద్దేవా చేశారు. ఆయన వెంట జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, బర్కం మల్లేశ్, గోపి రాజిరెడ్డి, చింతలపెళ్లి గంగారెడ్డి, కొయ్యాడి మహిపాల్, మహేశ్ గౌడ్, శంకర్ నాయక్, మండ రమేశ్ ఉన్నారు.