HomeKarimnagarBrs Karimnagar Mp Candidate Vinod Kumars Victories In Politics Are Natural
ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం
బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 4 : రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. అర్హత లేని కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ పథకంలో చేర్చి రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకువచ్చానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా రూ.350 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. నగరంలో ఇప్పటికీ అవే నిధులతో పనులు సాగుతున్నాయన్నారు. గురువారం కరీంనగర్‌లోని 59వ డివిజన్లో జరిగిన మార్నింగ్ వాక్‌లో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. దీనికి ఆయన హాజరై మాట్లాడారు.
ఎంపీగా పదవిలో ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, మళ్లీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడం అంటే ఇదేమన్నా పునరావాస కేంద్రమా? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా బండి సంజయ్‌కు ఎంపీగా ఉండాలనుకుంటే ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారని నిలదీశారు. తనకు కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న సూచనలు వచ్చాయని, కానీ తాను ఎంపీగా మాత్రమే పోటీ చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఎంపీగా ఐదేళ్లు ఉన్న బండి సంజయ్ ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. ఏమైనా అంటే ఉపాధి హామీ, అంగన్వాడీ సెంటర్లకు వచ్చే నిధులు ఎంపీగా తాను తెచ్చానని బండి సంజయ్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం రూ.26 కోట్లు తీసుకువచ్చామని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు నగరంలో ట్రిపుల్ఐటీ కోసం ప్రత్యేకంగా 50 ఎకరాల స్థలాన్ని కేటాయించామని, చివరి నిమిషంలో ఎన్నికలు రావడంతో అది పక్కన పడిందన్నారు. బండి సంజయ్ ఎంపీ అయిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు జాతీయ రహదారులు తీసుకువచ్చామన్నారు. అలాగే, కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ మంజూరు చేయించి ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించామన్నారు. ఇప్పటికే ఆ రైలు సిద్దిపేట వరకు వచ్చిందని, 2025 డిసెంబర్ నాటికి కరీంనగర్ చేరుకుంటుందన్నారు. అలాగే, కరీంనగర్ నుంచి కాజీపేటకు కూడా రైల్వే లైన్ కోసం ప్రయత్నాలు చేశామన్నారు. అభివృద్ధి ఆలోచన ఉన్న వారిని గెలిపించాలని, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే వారిని నమ్మవద్దని కోరారు. తాను ఎప్పుడూ ప్రజల కోసం ఏం చేయాలన్న తపనతోనే పని చేస్తానని తెలిపారు.
అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించండి
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే నగరంలో అభివృద్ధి ఆటంకం లేకుండా కొనసాగుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ కోసం పని చేసే వారు, పార్లమెంట్లో మాట్లాడే వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వినోద్‌కుమార్ ఎప్పుడూ నగరాభివృద్ధి, నియోజకవర్గ అభ్యున్నతి కోసం పని చేశారన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలపై అనేక మార్లు పార్లమెంట్లో తన గొంతు వినిపించారని గుర్తు చేశారు. బండి సంజయ్ ఒక్క రోజు కూడా రాష్ట్ర అభ్యున్నతి గూర్చి ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ గందె మాధవి, వాల రమణరావు, నాయకులు దూలం సంపత్, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.