మానకొండూర్, మే 30 : కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షతో జిల్లా ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని బీఅర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని, వారి మాటల తీరు కేవలం ఎన్నికల సభలో వాగ్దానాలు చేసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఅర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హెలీకాప్టర్‌లో వచ్చి వెళ్తే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని చురకలంటించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించాలని ఇటీవల మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్యర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే కేవలం తూతూ మంత్రంగా నిర్వహించారని మండిపడ్డారు.
ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇండ్ల కేటాయింపులో అసలైన నిరుపేదలకు అన్యాయం జరిగిందన్నారు. సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువశక్తి పథకానికి అర్హులని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకర్లే ఇంటి వద్దకు వచ్చి లోన్లు ఇస్తారు కదా? అని చెప్పారు. దరఖాస్తు సమయంలో ఈ నిబంధన ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాజీవ్ యువశక్తి కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారని, నిరుద్యోగులు, యువతను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనాలని అధికారులకు మంత్రులు సూచించలేదని, విత్తనాలు, ఎరువుల కొరతపై ఎందుకు చర్చించలేదని, రైతు భరోసాపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు ప్రశంసించినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుపై అనవసర రాద్దాంతం చేస్తూ రైతుల ఉసురు తీస్తున్నదని మండి పడ్డారు. కాళేశ్వరంను ఎండబెట్టి గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నా ఇరిగేషన్ మంత్రికి సోయిలేదని దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫియా జోరుగా సాగుతున్నదని, కమీషన్లు, వాటాల కోసం కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, బీఅర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఅర్ఎస్వీ మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, నాయకులు శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, పిట్టల మధు, దండబోయిన శేఖర్, బోడ రాజశేఖర్ పాల్గొన్నారు.