మానకొండూర్, ఆగస్టు 25: కాంగ్రెస్ జనహిత పాదయాత్రతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడానికి పాదయాత్ర పేరిట కొత్త డ్రామాకు తేరలేపిందని విమర్శించారు. ప్రజలకు ముఖం చూపించే దమ్ములేకనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌తో పాదయాత్ర చేపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏసీ కార్లలో వచ్చి ఏదో ఒక ఊరులో ఐదు కిలోమీటర్లు నడవడమే పాదయాత్రనా..? అని ప్రశ్నించారు. పాదయాత్రలో ఎక్కడైనా రైతులు, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారా..? అని నిలదీశారు. మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఅర్ ఆనవాళ్లను చెరిపి వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
కానీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరితరం కాదన్నారు. అధికారంలోకి వచ్చిన పందొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్‌రెడ్డికి ప్రజలకు ముఖంచూపే దమ్ము లేదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేపడుతున్నామని మంత్రి పొన్నం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గ్రామాల్లో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు వారికి కనిపించడం లేదా..? అని మండిపడ్డారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు ఎలా నీటిని తరలిస్తున్నదని ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీనాక్షీ నటరాజన్ ఎందుకు మాట్లాడలేదని, లక్ష్మీ పంప్‌హౌస్‌ను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.
యూరియా సంక్షోభంతో రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఆ పార్టీ నాయకులకు రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ మానకొండూర్ మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌గౌడ్, నా యకులు గుర్రం కిరణ్‌గౌడ్, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, రామంచ గోపాల్‌రెడ్డి, బొమ్మరవేని మల్లయ్య, మర్రి కొండయ్య, నెల్లి శంకర్, రాచకట్ల వెంకటస్వామి పాల్గొన్నారు.