జగిత్యాల, జూలై 16: ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనను గాలికొదిలేశారని, దృష్టంతా కేవలం ఎమ్మెల్యేల కొనుగోలు మీదనే పెట్టారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి, ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రైతులు, నిరుద్యోగులను నిండాముంచిందని మండిపడ్డారు. మక, పసుపు, వరి రైతులకు ఇస్తామన్న ఎకరాకు 15వేల రైతు భరోసా డబ్బులు ఎటుపోయాయో..? చెప్పాలని ప్రశ్నించారు.
కనీసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు కింద ఇచ్చిన 10వేలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పక్కకు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, మాట వినకపోతే భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తాము ఏనాడూ అలా చేయలేదని.. మీరూ చేయకపోతేనే మంచిదని హితవుపలికారు. రుణమాఫీ ప్రక్రియ అంతా బోగస్ అని, పీఎం కిసాన్ సమ్మాన్ నిబంధనలను తీసుకొని మెజార్టీ రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువతపై ప్రభుత్వం కక్షగట్టిందని, డీఎస్సీ పోస్టులు పెంచాలని, నోటిఫికేషన్లు వేయాలని ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్టీలో నుంచి ఎవరు బయటికి వెళ్లిపోయినా నష్టమేమీ లేదని, జగిత్యాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు తాను, లోక బాపు రెడ్డి, దావ వసంత అందుబాటులో ఉంటామని, ఆపదలో అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని, గతంలో కాంగ్రెస్ హయాంలో గ్రూప్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగిన విషయాన్ని మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 1.31లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, 26వేల ఉద్యోగాల భర్తీలో 75 శాతం ప్రాసెస్ చేస్తే, మీరు వచ్చి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.
నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, మెగా డీఎస్సీ వేయాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకుల పంపిణీ టైంలో తులం బంగారం గురించి కాంగ్రెస్ను ప్రశ్నించారని, మరి ఇప్పుడేమైందో..? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నాయకుడు లోక బాపురెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలం బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు పడిగెల గంగారెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కోల్ముల రమణ, కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, ఎలిగేటి అనిల్ కుమార్, మహేశ్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమీన్ బాయ్, శీలం ప్రవీణ్, నక గంగాధర్, చింతల గంగాధర్, సల్మాన్, ఈతేమద్ ఉల్హాక్, పడిగెల గంగారెడ్డి, నీలి ప్రతాప్, ప్రణయ్, భగవాన్, గాజుల శ్రీనివాస్ ఉన్నారు.