దేశ ప్రగతికి దిక్సూచి అయిన యువతకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిత ఉందని, రాజకీయ భవిష్యత్ కల్పించడం సైతం తమ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్వార్థ రాజకీయ, స్వప్రయోజనాల కోసం పలు పార్టీలు యువతను బలిపశువులుగా మార్చుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ, ఆ పార్టీ అనుబంధ శాఖల్లో వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న 100 మంది నాయకులు ఆదివారం భగత్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్లో మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల బీజేపీపై నిప్పులు చెరిగారు. కార్యకర్తలను వాడుకుని వదిలేస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించి, తమ చుట్టూ తిప్పుకునే పార్టీగా మారిపోయిందని దుయ్యబట్టారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతకు మారుపేరని చెప్పుకునే ఆ పార్టీ, వాటికి తిలోదకాలిచ్చి, కార్యకర్తలను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నదని బీఆర్ఎస్లో చేరిన నాయకుల ద్వారా స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు.
కలెక్టరేట్, సెప్టెంబర్ 3: దేశ ప్రగతికి దిక్సూచి అయిన యువతకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిత ఉందని, రాజకీయ భవిష్యత్ కల్పించడం పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీజేపీ, ఆ పార్టీ అనుబంధ శాఖల్లో వివిధ స్థాయిల్లో కొనసాగుతూ, మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆదివారం భగత్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో వారికి కండువా లు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల.. బీజేపీపై నిప్పులు చెరిగారు. కార్యకర్తలను వాడుకుని వదిలేస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించి, తమ చుట్టూ తిప్పుకునే పార్టీగా బీజేపీ మారిపోయిందని దుయ్యబట్టారు. తమ పార్టీలో మాత్రం ఇలాంటి సంస్కృతి లేదని, ఉద్యమకాలం లో అనేక మంది విద్యార్థులు, యువత కేసుల పాలై, జైలులో ఉంటే రాత్రికి రాత్రే బెయిల్ తెచ్చి, జైళ్ల నుంచి విడిపించిన ఘనత బీఆర్ఎస్దని చెప్పారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన అనేక మంది విద్యార్థులను నాయకులుగా మార్చి, వారిని తెలంగాణ సమాజానికి సేవకులుగా పంపిస్తున్నదని గుర్తు చేశారు.
వాడుకుని వదిలేసి, కార్యకర్తలపై కేసులు పెట్టించే సంస్కృతి బీఆర్ఎస్కు లేదంటూ పరోక్షంగా బీజేపీపై ధ్వజమెత్తారు. తెచ్చుకున్న తెలంగాణలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అనేక మంది ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరుతున్నారని వివరించారు. అభివృద్ధికి వస్తున్న ఆదరణను ఓర్వలేక, కొన్ని పార్టీల నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలకుల పార్వ దృష్టితో కరీంనగర్ అభివృద్ధిపై కసి పెరిగిందన్నారు. అడిగినన్ని నిధులు విడుదల చేసి, నగరాన్ని షైనింగ్ సిటీగా మార్చివేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు. ప్రధాన, అంతర్గత రహదారులతో పాటు విద్యుత్ టవర్ల ఏర్పాటు కోసం రూ.295కోట్లు విడుదల చేసి, కరీంనగర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు.
నగరానికి దేశంలో గుర్తింపు తెచ్చే క్రమంలో దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా తీగెల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ల నిర్మాణం కోసం రూ.800 కోట్లు విడుదల చేయడంతో పనులు శరవేగంగాకొనసాగుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల కోసం కాదని, యువత భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ నాయకులు ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎనిమిదేండ్లలో కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, నీట్ సిటీగా మారిందన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేక చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు మరోసారి తెరమీదకు రాబోతున్నాయన్నారు. ఢిల్లీ పార్టీల చేతిలో అధికారం పెడితే, తెలంగాణ మరోసారి అంధకారమవుతుందని, రాష్ట్ర భవిష్యత్ కోసం మరోసారి సీఎం కేసీఆర్‌కే అవకాశమివ్వాలని కోరారు. సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్‌కుమార్‌తో పాటు పలువురు మాట్లాడగా, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు గడ్డం ప్రశాంత్‌రెడ్డి, యువత విభాగం నగర అధ్యక్షుడు దీకొండ కులదీప్వర్మ, సాయి, యువ నాయకుడు గంగుల హరిహరణ్ పాల్గొన్నారు.
సామాన్యుని ఆర్థికాభివృద్ధే పార్టీ సిద్ధాంతం
సామాన్యుడి ఆర్థికాభివృద్ధే బీఆర్ఎస్ సిద్ధాంతం. సామాజిక, సంస్కృతాభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేపడుతున్న అనేక సంస్కరణల తో తెలంగాణ ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలువబోతున్నది. రాజ్యాధికారం కోసం కాదు.. దేశాభివృద్ధికోసమే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిం ది. ప్రజా సంక్షేమం కోసం బీజేపీ పాలన సాగడం లేదు. వారి వ్యక్తిగత ప్రచారం కోసమే పాలన సాగిస్తోంది. ప్రభుత్వ సొమ్ముతో ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తే, విరాళాలతో రామమందిరం నిర్మిం చి, తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న రు. అదే వా రికీ మాకు ఉన్న తేడా. అన్ని మతాలను సమానంగా గౌరవించే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది.
– బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
కాషాయం కసాయంగా మారింది
బీజేపీ నాయకుల తీరుతో కాషాయం కసాయంగా మారింది. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కార్యకర్తల సంక్షేమాన్ని గంగలో కలిపిన్రు. యువతను రెచ్చగొట్టి కేసుల పాలు చేసి, చుట్టూ తిప్పుకోవడమే పార్టీ లక్ష్యంగా మారింది. కార్యకర్తలను జైళ్ళలో ఉంచుతున్నరు. నాయకులు మాత్రం ఏసీ గదుల్లో ఉంటున్నరు. సొంత డబ్బులతో పార్టీ ఎదుగుదల కోసం నిర్విరామంగా కృషి చేస్తే, కార్యకర్తల కష్ట, సుఖాలను పట్టించుకోవడం లేదు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి ఆ పార్టీ నాయకులు సొంత ఎదుగుదల కోసం ఆర్థిక వనరులు కూడబెట్టుకుంటుండటం దుర్మార్గం. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడం కోసమే బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరా. అభివృద్ధి చేసే వారిని ఆదరించేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరముంది. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ను మరోసారి గెలిపించుకునేందుకు కృషి చేస్తా.
-జూపల్లి ధీరజ్
నగరాభివృద్ధిని చూసే బీఆర్ఎస్లోకి వచ్చా
మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధే నన్ను బీఆర్ఎస్లో చేరేలా ఆకర్షించింది. ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ రాష్ర్టానికే ఆదర్శంగా మారింది. కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధితో గంగులపై పోటీ చేయాలనుకునే వారి లాగులు తడుస్తున్నయ్. అందుకే, ప్రతిపక్ష పార్టీ నేతలు పార్టీ ఏ పని చెబితే ఆపని చేస్తానంటూ తప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో నిజమైన హిందుత్వవాది మంత్రి గంగుల కమలాకర్. ఇందుకు నిదర్శనమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నగరంలో నిర్మించడం. నీతి, నిజాయితీ, నిబద్ధతతో బీఆర్ఎస్లో కార్యకర్తలా పనిచేస్తా.
– గాజె ప్రద్యుత్
బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తా
కార్యకర్తల శ్రమదోపిడీ చేస్తున్న బీజేపీ నేతల ఓటమే లక్ష్యంగా పనిచేస్తా. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేటివి అసంబద్ధ పనులు అన్నట్లుగా బీజేపీ నాయకుల తీరు ఉంది. అందుకే ఆ పార్టీని వీడిన. కార్యకర్తల కష్టా న్ని గుర్తించి, వారి ఎదుగుదలకు సాయపడే బీఆర్ఎస్లో చేరిన. నగరాభివృద్ధికి మూల స్తంభాలైన మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ గెలుపుకోసం కృషి చేస్తా. కోహినూర్ వజ్రాల్లాంటి ఈ ఇద్దరితో కరీంనగర్ తెలంగాణకే గర్వకారణంగా నిలవబోతుంది. అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండబోతున్నది.
-సాకేత్