వీణవంక, అక్టోబర్ 29: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, ప్రతి ఒక్కరినీ కంటికిరెప్పలా పార్టీ కాపాడుకుంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని చల్లూరు గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్లో జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చల్లూరు గ్రామానికి చెందిన పొన్నాల సదయ్య, బండి సమ్మయ్య, శ్రీకాంత్, చంద్రయ్య, బొంగోని క్రాంతికుమార్, గణేశ్, ఎల్లయ్య సహా 50 మంది బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు, పరిపాలనా సౌలభ్యం కోసం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చల్లూరును మండలంగా ఏర్పాటు చేస్తానని, గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు రూ. లక్ష వరకు పంట రుణమాఫీ వర్తించని వారికి వారం పది రోజుల్లో డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ వెళ్లి వివరించాలని, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో చర్చ జరుగాలని సూచించారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందన్న వారే నేడు ఇక్కడి వెలుగులు చూసి ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రవేశపెట్టారని చెప్పారు. ఎవరేమన్నా మూడోసారి కేసీఆరే సీఎం అని, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసిన పార్టీకి ప్రజలు అండగా ఉండాలని, హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సర్పంచ్ పొదిల జ్యోతి-రమేశ్, ఎంపీటీసీ ఎలవేన సవిత-మల్లయ్య, ఉపసర్పంచ్ సంపత్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కుమార్, మాజీ సర్పంచ్ జక్కు నారాయణ, మాజీ ఎంపీటీసీలు తాండ్ర శంకర్, రమణారెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్ర ప్రజలను చల్లంగా చూడాలంటూ పోచమ్మ తల్లిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి వేడుకున్నారు. మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలు నిర్వహించగా, కౌశిక్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపిస్తారని, ముఖ్యంగా మహిళలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుల్లాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చొల్లేటి కిషన్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.