హుజూరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ను గెలిపిస్తుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన జమ్మికుంట మండలం మడిపల్లిలో గౌడ సంఘం నాయకులతో సమావేశమయ్యారు.
అనంతరం హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో ముఖ్యకార్యకర్తలతో ముచ్చటించారు. ఆ తర్వాత పట్టణంలోని 19, 21వ వార్డుల్లో పర్యటించి ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని, బీఆర్ఎస్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఆపద వస్తే పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు.
కేసీఆర్ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గందె రాధిక, కొలిపాక నిర్మల, బీఆర్ఎస్ మండలాపట్టణాద్యక్షుడు సంగెం అయిలయ్య, కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్ ఉమాదేవి, ఉపసర్పంచ్ సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు కొండపాక రమేశ్, చిరంజీవి, నగేశ్, సదానందం, కొమురయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు.