కరీంనగర్ కార్పొరేషన్/ గంగాధర/ సిరిసిల్ల టౌన్, జూలై 13 : రైతుల పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని అడిగితే ప్రతి పక్ష నేతల రక్తం పారిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల రక్తం రైతుల పొలాల్లో చల్లితే పంటలు పండుతాయని మాట్లాడడం దుర్మార్గమని తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని, రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఫిర్యాదులు చేశారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి టౌన్ సీఐ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్, నాయకులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. గంగాధర పోలీస్ స్టేషన్లో గంగాధర మండల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫిర్యాదు చేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ మహేశ్ బీ గితేకు పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడురు ప్రవీణ్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల నాయకులు మాట్లాడారు. నీళ్లివ్వాలని అడిగితే రక్తం చల్లాలని, నీళ్లు అడిగిన వారిని కన్నెపల్లి వద్ద బండ కట్టుకుని దూకాలని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఎంత వరకు సముచితమని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఆటవిక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గంగాధరలో సుంకె మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నుంచి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి నీళ్లు ఇవ్వకుంటే రైతుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రైతుల కోసం రక్తం చిందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

