వీర్నపల్లి, మార్చి 18: కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడిపోతున్న రైతులను చూసి చలించిపోయిన బీఆర్ఎస్ సాగు నీటి కోసం పోరుబాట పడుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైంది. వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాలకు నీరందించేందుకు బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాయినీ చెరువు ఎత్తిపోతల పథకానికి 166కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. మల్కపేట రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ ద్వారా రాయినీ చెరువును నింపి, ఇక్కడి నుంచి కాలువల ద్వారా మండలంలోని గొలుసుకట్టు చెరువులు, చివరన ఉన్న వన్‌పల్లి హన్మాయిచెరువును నింపాలని ప్రణాళిక రూపొందించారు. అయితే మల్కపేట రిజర్వాయర్ నుంచి చేపట్టిన పైప్‌లైన్ పనులను తుది దశకు చేరిన టైంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంతో మధ్యలోనే ఆగిపోయాయి. ఈ యాసంగిలో సాగు నీరందక పంటలన్నీ ఎండిపోతున్నాయి.
ఈ క్రమంలో రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ భావించింది. నీటికోసం పోరుబాట పట్టాలని సంకల్పించింది. బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు ఆధ్వర్యంలో మద్దిమల్ల రాయినీ చెరువు నుంచి వీర్నపల్లి దాకా పాదయాత్ర చేపట్టబోతున్నది. అనంతరం తహసీల్దార్‌కు వినతపత్రం అందించి, అక్కడి నుంచి అల్మాస్పూర్ పంప్‌హౌస్‌కు చేరుకొని పరిశీలించనున్నది. కాగా, పాదయాత్రలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వీర్నపల్లి మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి కోరారు.