బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ మంగళవారం జగిత్యాల జిల్లాకు రానున్నది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రైతు పిట్టల లింగన్న కుటుంబాన్ని పరామర్శించనున్నది. పంట రుణం మాఫీ కాక, అప్పులు తీరక మనస్తాపంతో పదిహేను రోజుల క్రితం చేనులోనే పురుగుల మందు తాగి లింగన్న ప్రాణం తీసుకోగా.. ఆయన భార్య లక్ష్మి, బిడ్డలను కలిసి మనోధైర్యం కల్పించనున్నది. ఈ మేరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు వివరాలు వెల్లడించారు. రైతు కుటుంబాల్లో మనోధైర్యం నింపి, సర్కారు మెడలు వంచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించిందన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు మంగళవారం ఉదయం 11 గంటలకు రైతు లింగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు.
అనంతరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో రైతులతో సమావేశం అవుతారని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రైతు సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయని మండిపడ్డారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ముఖ్యంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేసిన గాయానికి రైతులు కోలుకోవడం లేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేశామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇంకా నలభై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. ఆ కారణంగానే చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.