రాజన్న సిరిసిల్ల, జనవరి 25 (నమస్తే తెలంగాణ): అడ్డగోలు అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన వచ్చిన కాంగ్రెస్, ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోయింది. రెండేళ్లయినా ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేసింది. చేస్తూనే ఉన్నది. పైగా డైవర్షన్ రాజకీయాలతో బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నది. అభివృద్ధి చేయాలనే సోయి లేకుండా ఎంతసేపూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నదిది. నాడు కేసీఆర్ పాలనలో అమలు చేసిన పథకాలకూ బ్రేక్ వేస్తూ.. పేద, మధ్యతరగతి వర్గాలను అరిగోస పెడుతున్నది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్న వేళ కొత్త ఎత్తుగడలు వేస్తూ.. మరోసారి ప్రజలను దగా చేసేందుకు సిద్ధమవుతున్నది.
దీనిని గ్రహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రేవంత్ మోసాలను ఎండగట్టి ప్రజలను అప్రమత్తం చేయాలని బీఆర్ఎస్ సైన్యానికి పిలుపునిచ్చారు. ఇప్పటికే సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న ఆయన, నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల మున్సిపల్లోని 39వార్డుల ఇన్చార్జిలు, పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల హామీలు, మోసాలపై రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డులను గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని, అలాగే కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించి, ప్రగతి పత్రాలు అందించాలని గులాబీ సైనికులకు సూచించారు.
మళ్లీ బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, చాలా మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరించి, బీఆర్ఎస్కు పట్టం కట్టారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎక్కడా ఎమరుపాటు వద్దని, ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిన తీరుపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, అలాగే కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించాలని పిలుపునిచ్చారు. దీంతో గులాబీ సైనికులు రంగంలోకి దిగారు.
ఆదివారం ఇంటింటికీ వెళ్లి బాకీ కార్డులు అందజేస్తూ.. రేవంత్ రెండేళ్ల పాలనలో మోసాలను ఎండగట్టారు. అలాగే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల స్పందన బాగుందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటు కార్మికక్షేత్రం ప్రజలు కూడా హస్తం పార్టీ సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ఓట్లడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా వస్త్ర పరిశ్రమకు, నేతన్నలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చే ఆ పార్టీ నాయకులను నిలదీస్తామని స్పష్టం చేస్తున్నారు.
25 నెలల పాలనలో కాంగ్రెస్ బాకీలు
పథకం పేరు :బాకీ పడిన మొత్తం
రైతు భరోసా : 4 ఎకరాల కౌలు రైతుకు 76వేలు
రుణమాఫీ :2లక్షలు
వరిపంటకు :50వేలు బాకీ
500బోనస్ :(ప్రతి ఎకరాకు, 4 పంటలకు)
రైతు కూలీలు :24వేలు (రెండేళ్లకు)(ఉపాధిహామీ)
నిరుద్యోగులు :2 లక్షల ఉద్యోగాలు96వేల నిరుద్యోగ భృతి (24 నెలలకు)
విద్యాభరోసో కార్డు :5లక్షలు
ఆటో కార్మికులు :24వేలు ఒక్కొక్కరికి (రెండేళ్లకు)ఏడాదికి 12 వేలు
మహిళలకు 2,500 :62,500 ఒక్కొక్కరికి (25 నెలలుగా బాకీ)
కల్యాణలక్ష్మి,షాదీముబారక్ :తులం బంగారం
యువతులు, విద్యార్థినులు :స్కూటీలు
వృద్ధులు, బీడీ కార్మికులు : 4వేల పెన్షన్ (25 నెలలకు ఒక్కరికి 50వేలు)
దివ్యాంగులకు : 6 వేల పెన్షన్.. (25 నెలలకు ఒక్కరికి 50 వేలు)కాలేజీ విద్యార్థులకు
ఫీజు రీయింబర్స్మెంట్ : 8 వేల కోట్లు