మంథని, జనవరి 5 : అమలుకు సాధ్యం కానీ హామీలను ఆరు గ్యారెంటీల పేరుతో ప్రకటించిన ఫిట్టింగ్ మాస్టర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కటింగ్ మాస్టర్ సీఎం రేవంత్‌రెడ్డి అని, ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజ లను మోసం చేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకట న విడుదల చేశారు. కాంగ్రెస్ అంటేనే మోసమని, రైతు భరోసాతో మరోసారి రుజువు చేసుకున్నదన్నారు. రైతాంగానికి ఖరీఫ్, రబీ పంటలకు సంబం ధించి పెట్టుబడిసాయం బకాయి పడిందని, ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి తాజాగా, రైతు భరోసా రెండు పంటలకు రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించారని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే కేవలం రూ.2వేలు మాత్రమే పెంచారని, అవి కూడా రైతులకు ఎగనామం పెట్టిన డబ్బుల్లో నుంచి నాలుగేళ్లకు చూసుకుంటే రూ.8 వేలు మాత్రమే అవుతుందన్నారు. ఒక్కో రైతు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వానికే రూ.2 వేలు మిగులుతాయని, ఇందులో రైతు భరోసా పెంచింది ఏమీ లేదన్నారు. ఒక వైపు రుణమాఫీ కాక.. మరోవైపు బోనస్ బోగస్‌గా మారి రైతులు ఆందోళన చెందుతుంటే మరోసారి భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. చిన్న కాళేశ్వరం ఏడాదిలో పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పటికీ తట్టెడు మట్టి పోయలేదన్నారు. కానీ, రాష్ట్రానికి జీవధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎడారిలా మార్చి ఇసుక వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.