సిరిసిల్ల రూరల్, మే 26: రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, రాక్షస పాలన సాగుతున్నదని, కాంగ్రెస్ గూండాలు పథకం ప్రకారమే దాడి చేశారని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నిప్పులు చెరిగారు. కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసేందుకు బరితెగించిన కాంగ్రెస్ నాయకులను అదుపు చేయాల్సిన పోలీసులు లాఠీచార్జి పేరిట బీఆర్ఎస్ శ్రేణులను విచక్షణారహితంగా చితకబాదారని ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులను చావబాదుతరా..? అని ప్రశ్నించారు. దీనికి తప్పకుండా బదులు ఉంటదని హెచ్చరించారు. ఘటనను ఖండిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలను తంగళ్లపల్లి ఠాణాకు వెళ్లి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనూ విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే నియోజకవర్గంలోని ప్రజలకు సేవలందించే కార్యాలయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నట్టుగా వారి మాదిరిగా ఇక్కడ తాము చిల్లర మల్లర కార్యక్రమాలు చేయడం లేదని చెప్పారు. అందరినీ ఆదరించే తత్వం తమదని, పేదోళ్లు, అభ్యాగులు, నిర్భాబ్యాగులను ఆదరించే కేంద్రం క్యాంపు కార్యాలయమని వివరించారు. కాంగ్రెస్ గూండాలు పథకం ప్రకారమే దాడి చేశారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేసినప్పుడే పోలీసులకు తాము సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోమని ముందే చెప్పామన్నారు. క్యాంప్ కార్యాలయం ప్రభుత్వానికి సంబంధించినదని, దానిని కాపాడుతామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తామని, ఆ బాధ్యత చూసుకుంటానని పట్టణ సీఐ కృష్ణ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ పోలీసులు ఈ రోజు పక్షపాతంగా వ్యవహరించారని, కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఆ పార్టీ గూండాలను సాదరంగా తీసుకుని వచ్చి దాడి చేయించినట్లుగా వ్యవహరించారని ఆరోపించారు.
ఇరవై ఏండ్లుగా ప్రజలు ఓడిస్తూ, ముఖంపై ఉమ్మేసినా కేకే మహేందర్‌రెడ్డి సిగ్గు ఎగ్గులేకుండా పార్టీ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్నాండంటూ ఆగయ్య ఫైర్ అయ్యారు. కచ్చితంగా దీనికి బదులు ఉంటుందని హెచ్చరించారు. తాము పదేండ్లలో అధికారంలో ఉన్నామని, ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ప్రజలందరికీ సేవలందించే కార్యాలయంలో రేవంత్‌రెడ్డి లాంటి దొంగలు, బ్యాగులు మోసి వచ్చినోడి ఫొటో ఎందుకు పెడుతామని ప్రశ్నించారు. తెలంగాణ సాధించి కేసీఆర్, సిరిసిల్లను ప్రగతిలో నిలిపి కేటీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఏం చేసినా చెరిపేయలేవ్..? అంటూ రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ అల్లరి మూకలు, గూండాలు ప్రజల చేతుల్లో శిక్షించబడే రోజులు ముందున్నాయని, త్వరలోనే ఆ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లుతాయని చెప్పారు. అదుపులోకి తీసుకున్న తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే క్యాంపు కార్యాలయంపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయాచోట్ల ఆయన వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, దిడ్డి రాజు, మాట్ల మధు, చిరంజీవి, అమర్‌రావు, నందగిరి భాస్కర్‌గౌడ్, పార్టీ నేతలు ఉన్నారు.