అల్గునూరు నుంచి మరో ఉద్యమ శంఖారావం..!
విప్లవాల ఖిల్లా.. పోరాటాల పురిటిగడ్డ అల్గునూరు మరోసారి పోరాట శంఖారావం పూరించింది. నాడు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షకు వేదికైన ఈ గడ్డ.. నేడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై మరో పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది.
- దీక్షా దివస్ స్ఫూర్తి సభ గ్రాండ్ సక్సెస్
- ఉద్యమాల గడ్డపై మరో సమర నినాదం
- తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు పిలుపు
- ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పోటెత్తిన జనం
- ఉద్యమకాలం నాటి దృశ్యాల ఆవిష్కరణ
- తెలంగాణ ఆత్మగౌరవమే ఆయుధమన్న కేటీఆర్
- భావోద్వేగ ప్రసంగానికి సభికుల స్పందన
- దీక్షా దివస్ స్ఫూర్తితో భవిష్యత్ పోరాటానికి ప్రతిన
- గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం
విప్లవాల ఖిల్లా.. పోరాటాల పురిటిగడ్డ అల్గునూరు మరోసారి పోరాట శంఖారావం పూరించింది. నాడు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షకు వేదికైన ఈ గడ్డ.. నేడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై మరో పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం, స్వీయ అస్తిత్వ పరిరక్షణకు ప్రాంతీయ స్వీయ అస్తిత్వ పార్టీలే అవసరమని చాటిచెప్పింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు నాంది పలికిన దీక్షా దివస్ వేదిక.. నేడు తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మరో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. తెలంగాణను సాధించిన పోరాట స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే శక్తులపై మరోసారి సమరానికి సిద్ధం కావాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.
కరీంనగర్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : చారిత్రక గడ్డ అల్గునూరులో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ స్ఫూర్తి సభ ఘనవిజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ఉప్పెనలా పోటెత్తిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒకవైపు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం.. మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని నెమరేసుకోవడం.. ఇంకోవైపు తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వ పరిరక్షణ కోసం మరోసారి సమరశంఖం పూరించాలన్న పిలుపుతో సభ ఉద్వేగంగా సాగింది. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
నాడు రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి సాగించిన పోరాటాన్ని గుర్తు చేస్తూనే.. అమరుల త్యాగాలను వివరించారు. తెలంగాణ ఉద్యమంతో ఉద్యమ నాయకుడు కేసీఆర్‌తో కరీంనగర్ జిల్లాకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత రాష్ట్రంలో పరిస్థితులు, నీటి కొరత, విద్యుత్ కోతలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రక్షణకు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రసంగంలోని ఉద్వేగభరిత వ్యాఖ్యలు, ఉద్యమాన్ని వర్ణించిన తీరు, సభికులతో సాగించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఆయన అరెస్ట్.. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఎగిసిపడిన ఉద్యమం.. ఆనాటి చారిత్రక ఘట్టాలన్నీ మరోసారి కండ్లముందు కదలాడాయి.

కండ్ల ముందు కదలాడిన కేసీఆర్ దీక్ష
ఉద్యమ చరిత్రలో అల్గునూరుకు ప్రత్యేక స్థానం ఉంది. 2009 నవంబర్ 29న జరిగిన పరిణామాలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అంతకుముందు రోజు తెలంగాణ భవన్లో అయ్యప్ప స్వాముల పడిపూజ నిర్వహిచండం, వారి ఆశీర్వాదాల అనంతరం కేసీఆర్ దీక్షకు బయలు దేరడం వాటి ఘటనలను వివరించారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ వార్తలు రావడం, రాత్రంతా నెలకొన్న ఉత్కంఠ, కార్యకర్తల్లో ఆందోళనను గుర్తుచేశారు.
తీగలగుట్టపల్లి నుంచి సిద్దిపేట వైపు బయలుదేరిన వాహనాలను పోలీసులు అడ్డుకోవడం, మానేరు బ్రిడ్జి వద్ద వాహనాలను నిలిపివేయడం, కేసీఆర్ ప్రయాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వంటి ఘటనలను ప్రస్తావించారు. చివరకు అల్గునూరు చౌరస్తా వద్ద కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ ఘటన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందని వివరించారు. 17 ఏళ్ల తర్వాత కూడా ఆ రోజు జరిగిన ఘటనలు తన కండ్లముందు కదలాడుతున్నాయని ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ దీక్షకు బయలుదేరిన సందర్భం, అరెస్ట్ ఘట్టాలను గుర్తుచేసుకుంటూ మాట్లాడినప్పుడు సభలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొన్నది.
పాముల కోరలు పీకిన చీమల దండు కథ
తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన పోరాటాన్ని కేటీఆర్ తన ప్రసంగంలో అద్భుతమైన ఉపమానాలతో అభివర్ణించారు. ‘ఇది పాముల కోరలు పీకిన చీమల దండు కథ.. గద్దల తలలు నరికిన కాకుల కథ.. మదపుటేనుగులను బంధించిన గడ్డిపోచల కథ. ఒక బక్కపల్చని యోధుడు తన జాతి బానిస సంకెళ్లు తెంచిన కథ. పుడమికే పూనకాలు తెప్పించే భూమిపుత్రుల ఉద్యమ కథ. శిథిలాల నుంచి శిఖరాలను అధిరోహించిన అద్భుత కథ మన తెలంగాణ జాతి కథ. ఇది మామూలు కథ కాదు’ అంటూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని వివరించారు. అణచివేతలు, నిర్బంధాలను ఎదుర్కొంటూ తెలంగాణ ప్రజలు అసాధారణ పోరాటాన్ని చేశారని గుర్తుచేశారు.
ఆత్మగౌరవమే మన ఆయుధం
రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తమకున్న ఆయుధాలేమిటో కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఆత్మగౌరవమే తమ ఆయుధమని, తెలంగాణ బిడ్డలకు సహజంగా ఉండే పౌరుషమే పోరాట బలమని చెప్పారు. ఆ పౌరుషాన్ని పదును పెట్టుకోవడానికి, ఆత్మగౌరవాన్ని సాన పెట్టుకోవడానికి దీక్షా దివస్ ఒక సందర్భమని చెప్పారు. చరిత్రను మలుపు తిప్పిన రోజు.. తెలంగాణ జాతికి కొత్త ఊపిరి ఇచ్చిన రోజు దీక్షా దివస్ అని అభివర్ణించారు. తెలంగాణ చరిత్రను ఇతరులు చెప్పేలా వదిలేయకుండా.. మన పోరాటాలను, త్యాగాలను, సాధించిన విజయాలను మనమే భావితరాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

అమరవీరులకు జోహార్లు.. త్యాగాల స్మరణ
తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను సభలో స్మరించుకున్నారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాలు ఉద్యమంలో భాగస్వాములై సాగించిన పోరాటాన్ని గుర్తుచేశారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్న సందేశం సభలో వినిపించింది. అమరవీరుల కుటుంబాల త్యాగాలను, వారి కన్నీళ్లను మరిచిపోకూడదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్న భావనను కేటీఆర్ తన ప్రసంగంలో వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలన్న పిలుపు సభలో ప్రధానంగా వినిపించింది.
ఉద్యమ చరిత్ర నుంచి భవిష్యత్ పోరాటానికి
నాటి ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసుకోవడంతోపాటు ప్రస్తుత తెలంగాణ పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ అంశాలనూ కేటీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం, నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బలమైన రాజకీయ స్వరం అవసరమని పేర్కొన్నారు. ఢిల్లీ పార్టీలకు తలవంచకుండా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ‘స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష’ అన్న నినాదాన్ని మరోసారి వినిపించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడే రాజకీయ శక్తులను బలోపేతం చేయాలని కోరారు.
ప్రశ్నల వర్షం.. సభికుల నుంచి సమాధానాలు
కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం సభికులతో సాగిన సంభాషణలా కొనసాగింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రస్తావిస్తూ ఒక్కో అంశంపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సాయం, రైతుభరోసా, కౌలు రైతులకు చేయూత, రైతు కూలీలకు సాయం, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలతో పాటు రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సభికులు తమ స్పందనను నినాదాల రూపంలో తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రస్తావిస్తూ.. ఆ పోరాటంలో నాయకుడెవరని ప్రశ్నించినప్పుడు ‘కేసీఆర్’ అంటూ సభ ఒక్కసారిగా మార్మోగింది. మధ్యమధ్యలో ఆయన సంధించిన చమత్కారాలు, పంచ్‌లకు సభికుల నుంచి కేరింతలు వినిపించాయి. ఉద్యమ ఘట్టాలు, అమరుల త్యాగాలను గుర్తుచేసిన సందర్భాల్లో మాత్రం సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇలా ప్రశ్నలు, సమాధానాలు, నినాదాలు, చప్పట్ల మధ్య కేటీఆర్ ప్రసంగం కొనసాగింది.
ఉమ్మడి జిల్లా ఉద్యమ బంధానికి మరో గుర్తు
అల్గునూరు సభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమ చరిత్రతోపాటు నాలుగు జిల్లాల మధ్య ఉన్న రాజకీయ, సామాజిక అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసింది. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషించగా.. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల ప్రజలు కూడా వివిధ దశల్లో ఉద్యమంలో భాగస్వాములయ్యా రు. ఆ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నిర్వహించిన ఈ సభకు నాలుగు జిల్లాల నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాటి ఉద్యమంలో కలిసి నడిచిన ప్రాంతాల ప్రజలను మరోసారి ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ సభ.. తెలంగాణ అస్తిత్వం, హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలపై భవిష్యత్తులో సాగించే రాజకీయ చర్చలకు అల్గునూరును మరోసారి కేంద్రబిందువుగా నిలిపింది.
అంచనాలకు మించి జనం.. గులాబీ శ్రేణుల్లో జోష్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన అల్గునూరు గడ్డ మరోసారి జనప్రవాహంతో పులకించింది. అంచనాలకు మించి ప్రజలు తరలివచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పోటెత్తి, కేసీఆర్, కేటీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. నాటి ఉద్యమ జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకున్నవారు, కేసీఆర్ పోరాటాన్ని దగ్గరగా చూసినవారు, తెలంగాణ సాధనలో ప్రత్యక్షంగా భాగస్వాములైనవారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే సభా ప్రాంగణం పూర్తిగా కిక్కిరిసిపోవడంతో చాలామంది రోడ్లపైనే నిలబడి ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. కేటీఆర్ ప్రసంగానికి లభించిన స్పందనతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. భవిష్యత్ కార్యక్రమాలపై మరింత ఆసక్తిని పెంచింది.
తరలివచ్చిన ప్రజాప్రతినిధులు
మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసుధనా చారి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, శంబీపూర్ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, కాలేరు వెంకటేశ్, ఏపీ వివేక్, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్ కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధూకర్, కోరుకంటి చందర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, వసంత, అరుణ, నాయకులు చల్ల హరిశంకర్, రవీందర్ సింగ్, పార్టీల జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, మాజీ మంత్రి రాజేశం గౌడ్‌తోపాటు అనేక మంది ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.
భూకంపం పుట్టించిన నాయకుడు కేసీఆర్
దీక్షా దివస్ చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ జాతికి కొత్త ఊపిరి ఇచ్చిన రోజు 2009 నవంబర్ 29. ఆ రోజు ఇదే కరీంనగర్ గడ్డమీద ఒక అగ్నిపర్వతం బద్దలైంది. ఒక పెనుతుఫాన్ తీరం తాకింది. ఒక భూకంపం పుట్టించిన నాయకుడు కేసీఆర్. ఒకే ఒక్క నినాదం నిప్పు రవ్వ అయింది. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ ‘కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా..’ ఏదో ఒకటి తేలాలని చెప్పి ఆమరణ దీక్ష కోసం కేసీఆర్ కరీంనగర్ నుంచి సిద్దిపేట వైపు ప్రయాణం ప్రారంభించిన దృశ్యం ఇంకా 17 ఏండ్ల తర్వాత కూడా కండ్లముందు కనిపిస్తున్నది. మీ కోసం మీరు కలలు కని నెరవేర్చుకుంటే మిమ్మల్ని విజేత అంటారు. కానీ, నీ మట్టి కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం, నిన్ను నమ్ముకున్న మనుషుల కోసం కలలు కని, ఆ కల సాకారం కావడానికి చావుకు కూడా సిద్ధపడితే ఏమంటారు ఆ నాయకుడిని? వేరే దేశాల్లో మహాత్ముడు అంటారు! అదే తెలంగాణలో అయితే ఒక కేసీఆర్ అంటారు! దటీజ్ కేసీఆర్!
– కేటీఆర్
కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా ప్రతిజ్ఞ
దీక్షా దివస్ సభ ముగింపులో తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం, నీటి హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని సభికులతో కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు. ‘అమరుల త్యాగాల సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం.. తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించుకుందాం. జల దోపిడీపై జంగ్ సైరన్ మోగిద్దాం. ప్రగతి నిరోధకులను ప్రతిఘటిద్దాం’ అంటూ భవిష్యత్ పోరాటానికి దిశానిర్దేశం చేశారు. ఈ పిలుపుతో సభికులు పిడికిళ్లు బిగించి నినాదాలు చేశారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రసమయి బాలకిషన్ ఆలపించిన ఉద్యమ గీతాలు, కళాకారుల ఆటపాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ఉద్యమ గీతాలతో నాటి పోరాట జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కళాకారులు సభలో ఉత్సాహం నింపారు.
ఉద్యమానికి ఊపిరిలూదిన ఖిల్లా
కరీంనగర్ మామూలు జిల్లా కాదు, సింహగర్జన చేసిన కొదుమ సింహాల జిల్లా! ఉద్యమానికి ఊపిరిలూదిన ఖిల్లా! ఈ నేల మట్టిని నుదిటిబొట్టుగా పెట్టుకొని ఆ రోజు కేసీఆర్ దీక్షకు బయలుదేరిన అల్గునూరు గడ్డ మీద ఇవాళ పోటెత్తిన ఈ జనసంద్రానికి హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలుపుతున్న. ఈ గ్రౌండ్లో ఎంతమంది ఉన్నరో.. రోడ్లమీద కూడా అంతే మంది ఉన్నరు. వారిని దాటుకొని వచ్చేసరికి కొంత ఆలస్యమైంది. ఇది కరీంనగర్ గడ్డ. ఒక్కసారి అన్ని పిడికిళ్లు లేవాలి. ‘జై తెలంగాణ’ ‘జై తెలంగాణ’ కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి. తెలంగాణ అమరవీరులకు జోహార్లు.
– కేటీఆర్
సభా వేదికపై కూర్చున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, వొడితల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, బీఆర్ఎస్ నాయకులు
బానిస సంకెళ్లు తెంచిన కథ
నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్2 లేదు. గులాబీ జెండా ఎగరకపోతే తెలంగాణ లేదు. ఇవ్వాళ తెలంగాణ కాంగ్రెస్ లేదు. తెలంగాణ బీజేపీ లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి లేదు. అందుకే నేను చెబుతున్న! మళ్లొకసారి యాది చేసుకోండి! ఇది మామూలు కథ కాదు, ఒక బక్క పలుచని యోధుడు తన జాతి బానిస సంకెళ్లు తెంచిన కథ!
– కేటీఆర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

