వఝల కవిత్వం అనుభవాలకు అక్షర రూపం
కవిత్వం కేవలం భావోద్వేగాల వ్యక్తీకరణ కాదు. అది జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. సమాజ వైరుధ్యాలను ప్రశ్నించే చైతన్యం. మనిషి అంతరంగంలోకి తొంగి చూసి, అనుభవాలకు అక్షరరూపం ఇచ్చే సృజనాత్మక ప్రక్రియ. ఈ లక్షణాలను తనదైన అభివ్యక్తితో ఆవిష్కరిస్తున్న కవి వఝల శివకుమార్. ఆయన కవిత్వంలో జీవితానుభవం ఉన్నది. సామాజిక పరిశీలన ఉన్నది. ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నది. వ్యవస్థల పట్ల విమర్శనాత్మక దృష్టి ఉన్నది. అన్నింటికీ మించి మనిషిని, మనిషితనాన్ని అర్థం చేసుకోవాలనే తపన ఉన్నది.
ఆయన రచనా ప్రస్థానంలో మిత్రులతో కలిసి రూపొందించిన ‘లయ’తో పాటు స్వయమగా వెలువరించిన ‘గోగుపువ్వు’, ‘పాలకంకుల కల’, ‘దాఖలా’, ‘కలల సాగు’ ‘వేళ్లరహస్యం’ వంటి రచనలు ఉన్నాయి. ఆయన కవితల హిందీ అనువాద సంకలనం ’ఆఖ్రీ మౌఖా’ భాషా సరిహద్దులను దాటి ఇతర భాషల పాఠకులను చేరే అవకాశాన్ని కల్పించింది.
శివకుమార్ కవిత్వాన్ని పరిశీలించినప్పుడు కనిపించే ప్రధాన లక్షణం జీవితాన్ని దాని సమస్త సంక్లిష్టతలతో స్వీకరించడం. జీవితంలో కనిపించే సంతోషాల వెనుక దాగి ఉన్న విషాదాలు, అభివృద్ధి మాటున పెరుగుతున్న అసమానతలు, మానవ సంబంధాల్లో ఏర్పడుతున్న దూరాలు, సామాజిక వ్యవస్థల్లో పేరుకుపోతున్న వైరుధ్యాలు ఆయన కవిత్వంలో వస్తువులు. వఝల ఇటీవలి కవితా సంపుటి ‘వేళ్ల రహస్యం’ ఆయన సృజనాత్మక పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన రచన.
శీర్షికలోని ‘వేళ్లు’ అనే పదం కేవలం శరీరంలోని అవయవాలను సూచించే పరిమిత అర్థంలోనే కాకుండా, మనిషి స్పర్శకు, సృజనకు, సంబంధాలకు, అన్వేషణకు ప్రతీకగా కూడా విస్తరించే అవకాశం కల్పిస్తుంది. వేళ్లు మట్టిని తాకుతాయి. విత్తనాన్ని నాటుతాయి. అక్షరాలను రాస్తాయి. సంగీతాన్ని పలికిస్తాయి. శ్రమకు, అనుబంధానికి, సృజనకు, మానవీయ స్పర్శకు అవి సంకేతాలు. ఈ దృష్టితో ‘వేళ్ల రహస్యం’ అనే శీర్షికను పరిశీలిస్తే, మనిషి జీవితంలోని అనేక అంతరార్థాలను అన్వేషించే కవితా ప్రయాణంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ సంపుటిలో విభిన్న వస్తువులను సూచించే కవితా శీర్షికలు కనిపిస్తాయి. ఈ శీర్షికలే కవి ఆలోచనా ప్రపంచంలోని విస్తృతిని తెలియజేస్తాయి. పుస్తకం ఒక క్షేత్రమైతే, ఆ క్షేత్రంలో మొలకెత్తేవి ఆలోచనలు. మనిషి అంతర్మథనం నుంచి పుట్టే ప్రశ్నలు సమాజాన్ని అర్థం చేసుకునే సాధనాలవుతాయి.
శివకుమార్ కవిత్వంలోని మరో ముఖ్యమైన అంశం సామాజిక స్పృహ. సమాజంలో జరిగే పరిణామాలను కవి మౌనంగా చూస్తూ ఉండలేడు. అసమానతలు, అన్యాయాలు, అధికార దుర్వినియోగం, మానవ సంబంధాల క్షీణత, విలువల పతనం వంటి అంశాలు కవి ఆలోచనను ప్రభావితం చేస్తాయి. అందువల్లే శివకుమార్ కవితల్లో ప్రశ్నించే స్వరం వినిపిస్తుంది.
ఆ ప్రశ్నలు వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నవి కావు. సమాజాన్ని నడిపిస్తున్న వ్యవస్థలను, వాటిలోని వైరుధ్యాలను కూడా ప్రశ్నిస్తాయి. ఆయన కవిత్వంలోని వ్యంగ్య ధోరణి, పదాల ఎంపిక, భావాల నిర్మాణం పాఠకుడిని ఆలోచింపజేస్తాయి. సమాజంలోని అసంబద్ధతలను కవి గుర్తించడమే కాకుండా, వాటి వెనుక ఉన్న మానవ స్వభావాన్ని కూడా పరిశీలిస్తాడు. అందుకే ఆయన కవిత్వంలో సామాజిక విమర్శతోపాటు మానవ మనస్తత్వ విశ్లేషణ కూడా కనిపిస్తుంది.
తెలుగు సాహిత్యంలో కవిగా, రచయితగా, పత్రికా రచయితగా, సినీగేయకర్తగా, రేడియో ప్రయోక్తగా విశిష్ట స్థానం సంపాదించిన పసిద్ధ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని వఝల శివకుమార్ అందుకోవడం విశేషం. ఈ గౌరవం ఆయన సుదీర్ఘ కవితా ప్రస్థానానికి లభించిన సముచిత గుర్తింపు.
-డా.రాయారావు సూర్యప్రకాశ్‌రావు ,9441046839
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

