రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కార్పొరేషన్/సిరిసిల్ల టౌన్/ గంభీరావుపేట: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ దళం భగ్గుమన్నది. ఉద్యమనేతను కించపరిస్తే సహించబోమంటూ కదంతొక్కింది. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, కరీంనగర్లోని తెలంగాణచౌక్, గంభీరావుపేట అమరవీరుల స్తూపం, మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద నిరసనలకు దిగారు. ఎక్కడికక్కడ రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ‘రేవంత్రెడ్డి ఖబడ్దార్. ఇదేమీ రాజ్యం? ఇదేమీ రాజ్యం? వద్దురా కాంగ్రెస్ పాలన’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
సీఎం సీట్లో కూర్చున్నానే సోయిలేకుండా రేవంత్రెడ్డి ప్రతిపక్ష నేతలా దిగజారి మాట్లాడుతున్నాడని విమర్శించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయాచోట్ల నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు జక్కుల నాగరాజు, భూక్యా తిరుపతినాయక్ పాల్గొన్నారు. కాగా, సిరిసిల్లలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. లాక్కుంటూ వెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు.